delhi election results shocks Narendra Modi ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వచ్చేశాయి. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకుంది. ఫలితాల సరళి బట్టి బీజేపీ మరోసారి సింగల్ డిజిట్ సీట్లకు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ విశేషం ఏమిటంటే… కొన్ని నెలల ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ఢిల్లీలో ఉన్న ఏడు సీట్లలో ఏడూ గెలుచుకుంది.

లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పార్టీకి ఓటేస్తారన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి మారింది. ఓటర్ల ఆలోచనా సరళిలో మార్పు వచ్చింది. మోదీ రెండోసారి అధికారంలోకి రావడానికి జాతీయ అంశాలు తోడ్పడ్డాయన్నది కాదనలేని సత్యం. దేశ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకూడదంటే మళ్లీ మోదీనే రావాలనే ఆకాంక్ష ఓటర్లలోకి బలంగా వెళ్లింది.

దీంతో రెండోసారి పట్టం కట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. పూర్తిగా స్థానిక సమస్యలకే ప్రజలు పెద్దపీఠ వేసినట్టుగా కనిపిస్తుంది. సీఏఏ, ఆర్టికల్ 370, అయోధ్య వంటి జాతీయ అంశాలతో భాజపా ఎన్నికలకు వెళ్లింది. ఇవే అంశాలపై ఆ పార్టీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సమయమనం కోల్పోకుండా వ్యవహరించారు.

స్థానిక అంశాలు, ప్రభుత్వ పథకాలే అజెండాగా ముందుకెళ్లారు. అదే ఇప్పుడు కలిసి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం, మొహల్లా క్లినిక్కుల పేరిట వైద్యాన్ని అందించడం.. పరిమిత యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటివి ఆప్ కు చేశాయి. దీనితో దేశం వరకూ మోడీకి జై, రాష్ట్రం విషయంలో మాత్రం నై.