Delhi Daredevils vs Sunrisers Hyderabadఇరు జట్లు విజయం కోసం చివరి బంతి వరకు పోరాటం చేయడానికి మించి ప్రేక్షకులకు ఏం కావాలి? ఢిల్లీ – హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సరిగ్గా అలాంటి అనుభూతులనే పంచింది. చివరి బంతి వరకు దోబూచులాడిన విజయం, చివరికి ఢిల్లీని వరించింది. చావో రేవో అంటూ బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఈ విజయం మాంచి ఊరటచ్చినట్లే. అయితే, ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కావాలంటే మాత్రం మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్ లోనూ తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది.

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగుల స్కోర్ ను మాత్రమే నమోదు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి 56 బంతుల్లో 73 పరుగులు చేయడంతో కనీసం ఆ మాత్రం స్కోర్ అయినా సాధించగలిగింది. ప్రణాళికా బద్ధమైన బౌలింగ్ విధానంతో హైదరాబాద్ బ్యాట్స్ మెన్లను నిలువరించడంలో ఢిల్లీ బౌలర్లు సక్సెస్ సాధించడంతో, భారీ స్కోర్ కు అవకాశాలు లేకుండా పోయింది.

భారీ లక్ష్య చేధన కాకపోవడంతో నింపాదిగా ఆడుతూ వచ్చిన ఢిల్లీ బ్యాట్స్ మెన్లలో ఒక ఓపెనర్ డీకాక్ (2) పరుగులకే అవుట్ అవ్వగా, మరో ఓపెనర్ పంత్ (32) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అయితే వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా వచ్చిన కరుణ్ నైర్ చూడచక్కని షాట్లతో స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. మరో ఎండ్ లో వికెట్లు పడిపోతున్నా, చక్కని ఆట తీరుతో మ్యాచ్ ను చివరి వరకు తీసుకువెళ్ళిన కరుణ్ నైర్, చివరి రెండు బంతుల్లో 8 పరుగులు సాధించాల్సి ఉన్న తరుణంలో రెండు బౌండరీలను బాది మ్యాచ్ ను ఢిల్లీ వైపుకు తిప్పాడు.

అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీం ఫీల్డింగ్ చూసి అవాక్కవ్వడం ప్రేక్షకుల వంతయ్యింది. అత్యంత సులభమైన క్యాచ్ లను జారవిడవడమే కాకుండా, చివరి బంతిని ఆపేందుకు కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేసిన ప్రయత్నం అభిమానులకు నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించినట్లయితే టాప్ 1 స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం హైదరాబాద్ జట్టుకు వచ్చి ఉండేది. అయితే చేతిలో మరో మ్యాచ్ మిగిలి ఉండడంతో, ఆ మ్యాచ్ లో విజయం సాధించినా, అగ్ర స్థానాన్ని నిలబెట్టుకోవచ్చు.