delhi daredevils vs kings xi punjab IPL 2017ఈ ఏడాది ఐపీఎల్ లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో 90 శాతంకు పైగా మ్యాచ్ లలో రెండవ బ్యాటింగ్ చేసిన జట్లే విజయాన్ని సాధించాయి. దీంతో ఏ జట్టు కెప్టెన్ అయినా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం, ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించడం షరామామూలైపోయింది. కానీ, ఈ సెంటిమెంట్ కు బ్రేకులు వేసాడు ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్. శనివారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన జహీర్ ఖాన్, ముందుగా బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు.

తొలుత ఈ నిర్ణయం కాస్త షాక్ కు గురి చేసినప్పటికీ, మ్యాచ్ ముగిసిన తర్వాత జహీర్ తీసుకున్న నిర్ణయమే సరైనదిగా తేలింది. అయితే జహీర్ నమ్మకాన్ని ఢిల్లీ బ్యాట్స్ మెన్లు నిలబెట్టడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఓపెనర్ బిల్లింగ్స్ 55 పరుగులతో రాణించగా, చివర్లో ఆండర్సన్ (22 బంతుల్లో 39 పరుగులతో), మొరిసన్, కమ్మిన్స్ లు చెలరేగి ఆడడంతో 188 పరుగుల భారీ స్కోర్ నమోదైంది. వీరి బ్యాటింగ్ ప్రభావంతో చివరి 5 ఓవర్లలో ఏకంగా 68 పరుగులు లభించాయి.

భారీ లక్ష్య చేధనలో రెండవ ఓవర్ నుండే పంజాబ్ కు కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఏ దశలోనూ పంజాబ్ లక్ష్యం దిశగా అడుగులు వేయలేకపోయింది. బ్యాట్స్ మెన్లు అందరూ వరుసగా విఫలం కావడంతో, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో అక్సర్ పటేల్ 44 పరుగులతో రాణించడంతో కనీసం గౌరవప్రదమైన స్కోర్ నైన నమోదు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 137 పరుగులు నమోదు చేయడంతో, ఢిల్లీ 51 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. శనివారం నాడు జరిగిన రెండు మ్యాచ్ లలోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించడం గమనించదగ్గ విషయం.