defeated-ysrcp-mla-thota-vani-amanchiఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కూడా ఎమ్మెల్యేలు అవ్వాలని అనుకుంటున్నట్టుగా ఉంది. పెద్దాపురం, చీరాలలో ఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు – తోటా వాణి, ఆమంచి కృష్ణమోహన్, ఏసురత్నం తమపై గెలిచిన నేతలను అనర్హులుగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించారు. సాంకేతిక అంశాలతో వారిని అనర్హులుగా ప్రకటించాలని వారు కోర్టును కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే…. నిమ్మకాయల చినరాజప్ప తప్పుడు అఫిడవిట్‌ను దాఖలు చేసి మోసం చేశారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసిన తోట వాణి ఆరోపించారు.

అయన పై ఉన్న కేసులను.. 2014 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా పెన్షన్‌ పొందుతున్నారని, 2019 ఎన్నికలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఆదాయం పొందుతూ ఉండగా.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొని ఎన్నికల కమిషన్‌ను మరో మోసం చేశారని ఆమె చెప్పారు. మరోవైపు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై హైకోర్టులో ఆమంచి కృష్ణమోహన్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన ఆరోపించారు.

కరణం బలరాంకు నలుగురు సంతానమైతే అఫిడవిట్‌లో ముగ్గురే అని పేర్కొన్నారని చెప్పారు. అన్ని ఆధారాలతో కోర్టులో నిరూపిస్తానని ఆమంచి కృష్ణమోహన్‌ పేర్కొన్నారు. అలాగే గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు ఎన్నిక చెల్లదంటూ వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే మొత్తం ఐదు పేర్లతో బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఎగవేశారని ఆరోపించారు. 2014లో మడకశిర నుండి ఎన్నికైన ఈరన్న అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని కోర్టు ఆయనను అనర్హుడిగా ప్రకటించి ఆయన సమీప ప్రత్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఇప్పుడు అలాగే తమకు కూడా అవకాశం వస్తుందని ఆ నేతలు భావిస్తున్నారు.