వికేంద్రీకరణ అంటే... అభివృద్ధి అడ్డుకోవడమేనా..?పలు విషయాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ విశ్లేషకులనే కాదు, సామాన్య ప్రజలను కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. “వికేంద్రీకరణ” పేరుతో మూడు రాజధానుల బిల్లు అని హంగామా చేసి, చివరికి దానిని వారంతట వారే రద్దు చేసేసుకుని, మళ్ళీ వచ్చే ఏడాది మార్చి లోపున అసెంబ్లీలో పెడతామంటూ వైసీపీ నేతలు చెప్పిన విషయం తెలిసిందే.

మూడు రాజధానుల బిల్లు మాట ఎలా ఉన్నా, “వికేంద్రకరణ” అంటే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. కానీ అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఏపీ సర్కార్ చర్యలు ఉంటున్నాయని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా వాపోతున్నారు. దానికి తాజా ఉదాహరణే విజయవాడ కేంద్రంగా 189 కిలోమీటర్ల మేరకు ప్రతిపాదనలు చేసిన ఔటర్ రింగ్ రోడ్డును వద్దని చెప్పడం అంటూ మండి పడుతున్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు అనేది ఏ ప్రాంతానికైనా తలమానికంలా నిలుస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు రాక ముందు మరియు వచ్చిన తర్వాత పరిస్థితులను, ప్రాంతీయ స్థితిగతులను అంచనా వేస్తే, అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్డు యొక్క ప్రాధాన్యత ఏమిటో ఇట్టే అర్ధమైపోతుంది. అయినా ఈ విషయాన్ని అర్ధం చేసుకోవడానికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానవసరం లేదు, అలాగే ఆర్ధిక వేత్తలు అంతకంటే అవసరం లేదు.

ఒక ఊరిలో ఒక రోడ్డు వేస్తేనే ఆ ఊరి యొక్క రూపురేఖలు మారిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఒక నగరం చుట్టూ రోడ్డును నిర్మించాలని గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను ‘మాకు వద్దు’ అని చెప్పడంలో ఏపీ సర్కార్ ఉద్దేశం ఏమై ఉంటుంది? బహుశా ఈ రింగ్ రోడ్డు చుట్టుప్రక్కల మొత్తం కమ్మ సామాజిక వర్గపు నేతలు ఇప్పటికే భూములు కొనుగోళ్లు చేసేశారని భావిస్తున్నారా?

రాజధాని అమరావతిలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు మరియు కమ్మ వర్గానికి చెందిన బడా బాబులు భూ కుంభకోణాలకు పాల్పడ్డారంటూ గత రెండున్నర్రేళ్ళుగా జగన్ చేస్తున్న ప్రయత్నంలో నిజం లేదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేసాయి. బహుశా అలాంటి అనుమానాలు ఉంటే, రింగ్ రోడ్డును ఆపమని చెప్పడం కన్నా, ఆ పరిసర ప్రాంతాల్లో భూములు ఎవరెవరికి ఉన్నాయో ఎంక్వయిరీ చేస్తే సరిపోతుంది. అధికారం చేతిలో ఉంది కాబట్టి, ఈ సమాచారం సేకరించడం నిముషాల వ్యవధిలో అయిపోయే పని.

ఒకవేళ టిడిపి నేతలు గానీ, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు గానీ ఉంటే వారి పేర్లతో సహా బయటపెట్టి, ప్రజల ముందు దోషులుగా ఉంచవచ్చు కదా! అవకాశం వచ్చినపుడు ప్రజలే వారి పని పడతారు కదా! అలా కాకుండా అభివృద్ధి అడ్డుకుని ఏం సాధించాలంటూ రాష్ట్ర ప్రజలతో పాటు, ట్రాఫిక్ తో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విజయవాడ వాసులు కూడా వ్యక్తపరుస్తున్న ఆవేదనలు.

ముఖ్యంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం అంతా కేంద్ర ప్రభుత్వం పెట్టుకునే ఖర్చు, ఒక్క భూసేకరణ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు బదులు 78 కిలోమీటర్ల బైపాస్ అడిగారంటే నిజంగా భౌగోళికంగా రాష్టం మీద పట్టు ఉందా? 2019లో జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఇలాగే బెంజ్ సర్కిల్ వద్ద రెండవ ఫ్లై ఓవర్ నిర్మాణం మాకు అవసరం లేదంటూ కేంద్రానికి లేఖ రాయగా, తెలుగుదేశం మరియు ప్రజల వ్యతిరేకతతో సదరు రెండో ఫ్లై ఓవర్ నిర్మాణం చేయాలంటూ మళ్ళీ కోరారు.

జరిగిన, జరుగుతున్న పరిణమాలను విశ్లేషణ చేస్తే విజయవాడ కేంద్రంగా అభివృద్ధి జరగడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదా? అందుకే అపుడు రాజధానిని అడ్డుకోవడం, ఇపుడు ఔటర్ రింగ్ రోడ్డును వద్దని చెప్పడంలో భాగమా? ఆర్ధిక ఇబ్బందులతో రాష్ట్రం సొంతంగా ఏ ఒక్క అభివృద్ధి ప్రణాళికలు రచించడం లేదు, కనీసం కేంద్రం చేసేవాటికి సహకారం అయినా ఇవ్వాలి కదా… అంటూ నిట్టూర్పును ప్రదర్శించడం ఏపీ ప్రజల వంతు!