deadpool-2-telugu-trailer‘అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’ సినిమాతో ఇండియాలో మళ్ళీ హాలీవుడ్ సినిమాల దండయాత్ర ప్రారంభమైంది. ఈ సినిమా దాదాపుగా 200 కోట్ల షేర్ ను టచ్ చేయనుండగా, దీని స్ఫూర్తితో ఇప్పటికే ‘జురాసిక్ వరల్డ్’ వంటి హాలీవుడ్ బొమ్మలు క్యూ లైన్ లో రెడీగా ఉన్నాయి. ఇదే జాబితాలో “డెడ్ పూల్ 2” కూడా చేరబోతోంది.

గతంలో వచ్చిన ‘డెడ్ పూల్’ ఇండియన్ సినీ ప్రేమికులను విశేషంగా అలరించడంతో, ఈ ‘డెడ్ పూల్ 2’ సినిమాపై మార్కెట్ వర్గాల్లో క్రేజ్ ఉంది. ఈ నెల 18వ తేదీన ఇంగ్లీష్ తో పాటుగా ఇండియన్ భాషలైన హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తెలుగులో తాజాగా విడుదల చేసారు.

సాధారణంగానే హాలీవుడ్ బొమ్మలలో డబ్బింగ్ తో కామెడీ జనరేట్ అవుతుంది. ఈ సినిమాలో కూడా అలాంటి కామెడీకి కొదవలేదని ట్రైలర్ స్పష్టం చేయగా, దీనికి తోడుగా సినిమాలోని గ్రాఫిక్స్ మరింత కామెడీని కలిగించేలా ఉన్నాయి. ముఖ్యంగా ఎదురుగా నిల్చుని గన్ కాల్చే సన్నివేశం, మరింత హాస్యాస్పదంగా మారింది.

గతంలో పలు తెలుగు మరియు తమిళ చిత్రాల్లో ఇలాంటి గ్రాఫిక్స్ ను ప్రేక్షకులు చూసి విపరీతంగా నవ్వుకున్నారు. అయితే హాలీవుడ్ బొమ్మలలో కూడా గ్రాఫిక్స్ ఇంత కామెడీగా ఉంటాయని ఊహించని విషయం. యాక్షన్ సన్నివేశాలు కూడా సోసోగానే ఉండడంతో, ఈ ‘డెడ్ పూల్ 2’ ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.