Chiranjeevi Waltair Veerayyaఏ ఉద్యోగంలో అయినా వయసుకు పరిమితి ఉంటుంది. అరవై దాటాక రూల్ ప్రకారమే రిటైర్మెంట్ తీసుకోవాలి. వ్యాపారమైనా సరే ఆ టైంకి శరీరంలో సత్తువ తగ్గిపోయి ఇక చాలనిపిస్తుంది. కానీ సినిమాల్లో అలా ఉండదు. ముఖ్యంగా హీరోలు మనవళ్లను ఆడించే స్టేజికి వచ్చినా సరే హీరోయిన్లతో డాన్సులు విలన్లతో ఫైట్లు చేయకపోతే అభిమానులు ఒప్పుకోరు. అందుకే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు లేట్ ఏజ్ లో అడవి రాముడు, ప్రేమ నగర్లు చేసినా ఇండస్ట్రీ హిట్లు దక్కాయి. ప్రేమాభిషేకం టైంలో యాభైలో తనను లవర్ బాయ్ గా చూపించడం ఏమిటని నాగేశ్వరరావు సందేహం వ్యక్తం చేస్తే దాసరి ఏకంగా దాన్ని ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో తీసి వావ్ అనిపించారు.

ఇప్పుడు డీ ఏజింగ్ కాలం వచ్చేసింది. అంటే సాంకేతికతను వాడి హీరోల వయసును స్క్రీన్ మీద బాగా తగ్గినట్టు చూపించడం. ఇది ఒకరికే కాదు అందరికీ చేస్తున్నారు. తాతల కాలంలో ఏమో కానీ ఇప్పటి తరం ప్రేక్షకులు బాగా తెలివి మీరిపోయారు. మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు. ముడతలను కళ్ళ కింద చారలు మాయం చేసినా నిజ జీవితంలో వాళ్ళను ప్రత్యక్షంగా చూసిన కళ్ళతో కృత్రిమ లుక్స్ ని ఒప్పుకోలేకపోతున్నారు. ఆచార్య, వాల్తేర్ వీరయ్యలో చిరంజీవికి చేస్తున్నది ఇదే. శృతి హాసన్ పక్కన జోడిగా సరితూగాలంటే ఈ అడ్జస్ట్ మెంట్లు తప్పవు. కానీ ఇలాంటి ప్రయత్నాలను జనం ఎంతమేరకు రిసీవ్ చేసుకుంటారనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి

తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్ లకూ ఈ సమస్య ఉంది. అందుకే లోకనాయకుడు చాలా తెలివిగా విక్రమ్ లాంటి సబ్జెక్టులను ఎంచుకుని మనవడితో ఉండే పాత్రలతో యాక్షన్ ఎంటర్ టైనర్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇదే కమల్ విశ్వరూపంలో రొమాన్స్ చేసి లిప్పు లాకులు పెడితే పబ్లిక్ మొహం తిప్పుకున్నారు. రజినిని సైతం నయనతార లాంటి సీనియర్ల పక్కన ఓ మాదిరిగా ఒప్పుకుంటున్నారు కానీ ఏ పూజా హెగ్డేనో రష్మికనో అయితే చూడటం కష్టమే. ధమాకాలో రవితేజకు శ్రీలీలను జోడిగా తీసుకున్నప్పుడు సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వచ్చాయి. తెరమీద ఎలా పండిందో చూడకుండానే నెగటివ్ జడ్జ్ మెంట్లు ఇచ్చినవాళ్లున్నారు

మారుతున్న జనరేషన్ కు తగ్గట్టు ఈ డీ ఏజింగ్ మంత్రం పని చేయడం లేదని గుర్తించడం చాలా అవసరం. అమితాబ్ బచ్చన్ ఎప్పుడో ఈ ప్రయోగం మానేశారు. సల్మాన్ ఇంకా అరవై టచ్ కాలేదు కాబట్టి నెట్టుకొస్తున్నారు. అమీర్ కు ఆ ఆవసరమే పడటం లేదు. మోహన్ లాల్, మమ్ముట్టిలు నో రొమాన్స్ కథలనే ఓకే చేస్తున్నారు. గత రెండు మూడేళ్లుగా బాలకృష్ణకూ జంటను సెట్ చేయడంలో సమస్యలొస్తున్నాయి. ఏదైతే టెక్నాలజీ వాడి జనంతో జిమ్మిక్కులను చేస్తున్నారో వాటిని ఈజీగా గుర్తుపట్టేస్తున్న జనం మైండ్ సెట్ కు తగ్గట్టు మనమూ మారాలి. ఇవాళ వీరయ్య కావొచ్చు రేపు ఇంకో సినిమా కావొచ్చు డీ ఏజింగ్ మంత్రానికి ఎక్స్ పరి డేట్ వచ్చేసిందని అర్థం చేసుకోవాలి.