KTR says TRS supports Andhra Pradesh Special Statusఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన కీలకమైన డేటా చోరీ చేశారు అంటూ టీడీపీ సేవ మిత్ర యాప్ కోసం పని చేస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ పై తెలంగాణ పోలీసులు దాడి చేసి కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. కేసు గురించిన హైదరాబాద్ పోలీసులు పెట్టిన మొదటి ప్రెస్ మీట్ లో డేటా చోరీ చుట్టూనే తిరిగింది కథ అంతా. అయితే తాజా ప్రెస్ మీట్ లో మాత్రం డేటా ను ఉపయోగించి ఓట్లు ఏమన్నా తీసేశారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టు చెప్పారు. అయితే దర్యాప్తు సరళి మారడానికి తెరాస కారణమని తెలుస్తుంది.

ఆ పార్టీ చెందిన టీఆర్ఎస్ మిషన్ అనే యాప్ లో కూడా ప్రజల డేటా, ప్రభుత్వ పథకాల లబ్ది దారుల వివరాలు ఉన్నట్టు తేలింది. ఈ యాప్ ను తెరాస ను సపోర్టు చేసే ఎన్నారైలు తయారు చెయ్యగా తెరాస ఎంపీ కవిత దానిని లాంచ్ చేశారు. ఒక నాయకుల మీటింగులో కేటీఆర్ లబ్దిదారుల వివరాలు అన్ని తమకు అందుబాటులో ఉన్నాయని వారిని చేరుకొని ఓట్లు అడగాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనితో అప్రమత్తమైన తెరాస వారు ఆ యాప్ ను ప్లే స్టోర్ నుండి ఉన్నఫళంగా తీసేశారు.

అసలు ఆ యాప్ తో పార్టీకి సంబంధమే లేదు అంటూ ప్రకటన చేసేశారు. అయితే ఆ యాప్ ని లాంచ్ చేస్తూ కవిత దిగిన ఫోటోలకు సమాధానం చెప్పే వారు లేరు. ఇదంతా ఎందుకు అనుకున్నారో ఏమో టీడీపీ కేసును కూడా ఇప్పుడు డేటా చోరీ వైపు కాకుండా ఓట్ల తీసివేతకు డేటా వుపయోగించారా అనే కోణంలోకి తిప్పేశారు. అన్నం వడ్డించే వాడు మనవాడైతే ఇంక మన ఇష్టం. అయితే ఈ మొత్తం విషయంలో పోలీసులు కొందరికి కావలసిన విధంగా ఆడటం గమనార్హం.