Dastagiri-Jaganవైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి ఆదివారం కడపలో బస చేసిన సీబీఐ అధికారులని కలిసి నోటీస్ తీసుకొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “సిఎం జగన్మోహన్ రెడ్డి తలుచుకొంటే ఈ హత్యకేసుని కేవలం 10 రోజులలోనే తేల్చేయగలరు. కానీ వద్దనుకొన్నారు కనుకనే ఇన్నేళ్ళుగా ఇంకా సాగుతోంది. ఈ కేసుకి సంబందించి నేను చెప్పిన విషయాలన్నీ అబద్దాలే అని కొందరు వైసీపీ నేతలు వాదిస్తున్నారు. అబద్దాలే అయితే సీబీఐ వాళ్ళు ఇంకా ఎందుకు దర్యాప్తు చేస్తున్నట్లు?ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుకనే సీబీఐ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. దానిలో భాగంగానే మొన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీస్ ఇచ్చి హైదరాబాద్‌ పిలిపించుకొని ప్రశ్నించారు.

ఈ కేసులో నిజానిజాలు త్వరలోనే బయటపడతాయి. ఈ కేసు విచారణ హైదరాబాద్‌కి బదిలీ అవడం మంచిదే. హైదరాబాద్‌ బదిలీ అయిన తర్వాతే కేసు విచారణ వేగం పుంజుకొంది. నన్ను ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో విచారణకి రమ్మని ఆదేశించారు. నేను తప్పకుండా విచారణకి హాజరై ఈ హత్య కేసులో నాకు తెలిసిన అన్ని విషయాలని చెప్తాను. ఈ కేసు విచారణ త్వరగా పూర్తవ్వాలని నేను కోరుకొంటున్నాను. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా విచారణ త్వరగా పూర్తయ్యి దోషులకి శిక్ష పడాలని కోరుకొంటున్నారు,” అని దస్తగిరి అన్నారు.