dasari-narayana-rao-kapuసోమవారం నాడు నిర్వహించిన ‘దాసరి అండ్ కో’ ప్రెస్ మీట్ చివరన, దాసరి మాట్లాడుతూ… “ఉద్యమానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన వారిపై కాపు మంత్రుల చేత బురద జల్లించే ప్రయత్నం చేస్తూ… విభజించు – పాలించు అన్న దానిని అవలంభిస్తున్నారని, మాపై బురద జల్లాలని ప్రయత్నిస్తే… మా దగ్గర చాలా పెద్ద బురద ఉంది మీకు సంబంధించింది… జాగ్రత్త..!” అంటూ ముగించారు. అంటే దాసరి ఎలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నట్లు అన్న ప్రశ్న తలెత్తుతోంది.

నిజంగా ప్రభుత్వానికి సంబంధించింది ఏదైనా తెలియని కోణం దాగి ఉంటే, అది దాసరి వర్గానికి తెలిసి ఉంటే, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఒక రాజకీయ నాయకుడిగా దాసరిపై ఉంది. అలా కాకుండా బెదిరింపు రాజకీయాలకు పాల్పడే విధంగా మాట్లాడడం ఏ మాత్రం సమంజసం కాదన్న విషయాన్ని దాసరి గారు గుర్తించాలి. ప్రజలు అధికారం ఇచ్చిన ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే ప్రజలకు చెప్పాలి గానీ… మా నేతకు ఏదైనా జరిగితే… మీ బురదను బయటపెడతాం అంటే… అప్పుడు ఎవరైనా నమ్ముతారా? రాజకీయ విమర్శలలో భాగంగా తీసిపడేస్తారు.

ప్రభుత్వం ‘బురద’ ఉందని చెప్తున్న దాసరికి, ఇప్పటికే బొగ్గు ‘మసి’ అంటుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు నుండి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయట పడగలిగారు గానీ, దాసరికి విముక్తి లభించలేదు. ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్న దాసరిపై అభియోగాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో ఎవరికీ తెలియని పరిస్థితి. టిడిపిపై దాసరి వేసిన బురదను, తెలుగు తమ్ముళ్ళు బొగ్గు మసితో కడిగేస్తారేమో చూడాలి.