jagan-met-dasari-narayana-raoఇటీవల కాలంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు ఎవరి ఊహలకు అందడం లేదనడంలో సందేహం లేదు. ఓ పక్కన ‘మీ గెజిట్’ అంటూ ‘ఈనాడు’పై అక్కసును వెళ్ళగక్కుతూ విమర్శిస్తూ, మరో పక్కన ‘ఈనాడు’ వ్యవస్థాపకుడు రామోజీరావుతో భేటీ అవ్వడం వైసీపీ వర్గాలనే అవాక్కు చేసాయి. ఇలా అంచనాలకందని రాజకీయ చర్యలతో ఎప్పుడూ జగన్ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా దర్శకరత్న, మాజీ కాంగ్రెస్ నేత దాసరి నారాయణరావుతో మంతనాలు జరపడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దాసరి ఇంటికి చేరుకున్న జగన్ కు పుష్పగుచ్చంతో ఘనస్వాగతం పలికిన మాజీ కేంద్రమంత్రి శాలువాతో సత్కరించారు. అనంతరం మేడపైకి వెళ్లి ఇరువురు అంతరంగీక సమావేశంలో పాల్గొన్నారు. తుదకు మీడియాతో రొటీన్ డైలాగులు వేసి సమావేశ సారాంశాన్ని క్లుప్తంగా వివరించారు.

“జగన్ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని, ప్రజా సమస్యలపై జగన్ పోరాడుతున్నారని, జగన్ కు తన దీవెనలు, ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయని, ఇప్పటికే మంచి నాయకుడిగా ఎదిగిన జగన్, భవిష్యత్తులో మరింతగా ఎదగాలని తాను కోరుకుంటున్నానని” దాసరి అన్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాలంటూ దాసరిని జగన్ ఆహ్వానించారు. అయితే ఈ విషయంపై దాసరి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇది తెర ముందు జరిగిన విషయం కావడంతో అందరికీ తెలిసిందే. అయితే విశ్వసనీయ రాజకీయ వర్గాల ప్రకారం ఈ భేటీ వెనుక పెద్ద “స్కెచ్” ఉందని తెలుస్తోంది.

ఏపీలో అత్యధిక సామజిక వర్గం ఉన్న ప్రజలు దాసరి వర్గానికి చెందిన వారు. గత ఎన్నికల్లో ఈ వర్గం ఎక్కువ శాతం ఓట్లన్నీ టిడిపికి పడిన మాట రాజకీయ వర్గీయులకు విదితమైన అంశమే. ప్రజలకు ప్రత్యామ్నాయం లేకపోవడం గానీ, చంద్రబాబుపై విశ్వసనీయత గానీ, ఎన్నికల హామీలు గానీ, క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ‘ట్విస్ట్’ గానీ… ఇలా కారణాలు ఏమైనా దాసరి వర్గపు ఓట్లతో తెలుగుదేశం జయభేరి మ్రోగించింది. దీంతో ఈ వర్గాన్ని విశేషంగా ఆకర్షించేందుకు జగన్ వేసిన ఎత్తుగడలో భాగంగానే దాసరిని పార్టీలోకి ఆహ్వానించారని పొలిటికల్ వర్గాల టాక్.

ఈ ఏడాదిలో పవన్ కళ్యాణ్ తో దాసరి ఓ సినిమా నిర్మిస్తుండడం… అలాగే దాసరితో జగన్ భేటీ కావడం అనేవి కేవలం కాకతాళీయమేనా? లేక దీని వెనుక ఇంకేమైనా “మతలబు” దాగి ఉందా? అన్న రీతిలో కూడా చర్చలు సాగుతున్నాయి. అయితే తన వర్గం ఓట్లన్నీ జగన్ వైపుకు తిప్పే సామర్ధ్యత దాసరికి ఉందా? అంటే దానికి సమాధానం అందరికీ తెలిసిందే. అయినా కూడా జగన్ దాసరిని పార్టీలోకి ఆహ్వానించడం అనేది “కొత్త నీరు – పాత నీరు” కాన్సెప్ట్ క్రిందికే వస్తుందా? జగన్ వద్ద ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య రానూ రానూ తగ్గుతూ వస్తుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుండడంతో దాసరి వంటి సీనియర్లను అడ్డు పెట్టుకోవడం జగన్ అభిమతమా? ఏమో ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.

చివరిగా… ఒక సామజిక వర్గం ఓట్లన్నీ ఒక మనిషిని చూసి పడతాయని భావిస్తే అంత కంటే అవివేకం మరొకటి ఉండదని మెగాస్టార్ చిరంజీవి ఉదంతం నిరూపించింది. అలాగే, పవన్ ప్రచారం చేసారని తన సామజిక వర్గం ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకి పడి ఉన్నట్లయితే, ఇరు పార్టీల మధ్య 5 లక్షల ఓట్లు కాదు, కనీసం 50 లక్షల ఓట్లు వ్యత్యాసం ఉండేది. మరి జగన్ కు ఇవన్నీ తెలియవా? తెలిసి చేయడమే జగన్ స్టైల్..! అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాదంటారా..!?