Dasari Narayana Rao - Hospital Billsఇటీవల అనారోగ్యానికి గురైన టాలీవుడ్ పెద్దన్న, మాజీ కేంద్ర మంత్రి అయిన ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు సుమారు గత నెల రోజుల నుంచి కిమ్స్ ఆసుపత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఆరోగ్య పరిస్థితులు మెరుగు కావడంతో, ఈ నెల 30వ తేదీన డిశ్చార్జ్ కానున్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు జరిగిన వైద్యానికి గానూ, ఉన్న రూమ్ కు గానూ ఆసుపత్రి బిల్లు తడిసి మోపెడు అయినట్టు తెలుస్తోంది.

కిమ్స్ ఆసుపత్రిలోని ప్రత్యేక వీఐపీ గదుల్లో ఉంచి, దాసరికి చికిత్స అందించారు. ఈ వీఐపీ గదికి ఒక్కో రోజు అద్దె దాదాపుగా 30 నుండి 40 వేలు దాకా ఉంటుందని సమాచారం. అలాగే దాసరి కుటుంబ సభ్యులు బస చేసేందుకు రెండు వీఐపీ సూట్లు, దాసరిని పరామర్శించేందుకు వచ్చే వారి కోసం మరికొన్ని సూట్లు తీసుకున్నారు. పరామర్శించేందుకు వచ్చిన వారికి టీలు, టిఫిన్లు, భోజనం… ఇలా అన్నీ కలుపుకుని బిల్లు మొత్తం 90 లక్షల వరకు చేరిందట.

ఇప్పటికే ఆసుపత్రి బిల్లు ఊహించని దాని కంటే ఎక్కువకు చేరుకోవడంతో, వీఐపీ సూట్ నుంచి సాధారణ గదికి దాసరి వచ్చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ బిల్లును దాసరి తన వ్యక్తిగత ఖాతాలో నుండి చెల్లిస్తారా? లేక మాజీ కేంద్ర మంత్రి కనుక కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందా? అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ తో భారీ బడ్జెట్ సినిమాను నిర్మించేటంత సత్తా ఉన్న దాసరికి ఈ కోటి రూపాయల బిల్లును చెల్లించుకోలేరా? అంటూ ఈ సందర్భంగా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.