dasari-narayana-rao fires on heroinesఅప్పుడెప్పుడో సినీ అవార్డుల వేడుకలకు హీరోయిన్లు హాజరు కావడం లేదని ఆవేదన వెలిబుచ్చిన దాసరి మాటలు ఇండస్ట్రీలో ఎంతటి ప్రకంపనలను సృష్టించాయో తెలిసిందే. దీనిపై మెగా వారసుడు రామ్ చరణ్ కామెంట్స్ తో హీటేక్కిన ఉదంతం చల్లారడానికి చాలా సమయమే పట్టింది. అయితే తాజాగా మరోసారి అదే హీరోయిన్ల విషయమై సంచలన ప్రకటనలకు తెరలేపారు దాసరి.

“తెలుగు చిత్ర పరిశ్రమ ఆంగ్ల చిత్ర పరిశ్రమగా మారిపోతోందని, ఆర్టిస్టులు ముఖ్యంగా హీరోయిన్లు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని” అన్న దర్శకరత్న దాసరి, “ఇక నుండి హీరోయిన్లు తెలుగులో మాట్లాడకపోతే, తాను ఫంక్షన్స్ నుంచి వాకౌట్ చేసి నిరసన తెలుపుతానని” హెచ్చరించారు. ఓ కొత్త చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన దాసరి, “ఏ భాష నుంచి వచ్చిన హీరోయిన్లైనా, వారిని తెలుగు పరిశ్రమ గౌరవిస్తుందని, కాబట్టి వారంతా తెలుగు నేర్చుకుని రావాలని, తాను ఓ సిన్సియర్ సలహా ఇస్తున్నానని” చెప్పారు.

“ఇప్పుడు వేదికపై ఉన్న హీరోయిన్లు రాయ్ లక్ష్మి, నికిషా పటేల్, అరుంధతీ నాయర్ లు మళ్ళీ స్టేజ్ ఎక్కేలోగా తెలుగులో మాట్లాడాలని, లేకుంటే ఆ సభ నుంచి తాను వెళ్లిపోతానని” అన్నారు. దాసరి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఇండస్ట్రీ వర్గాలలో మిశ్రమ స్పందన వస్తోంది. ఒకప్పుడు అసలు హీరోయిన్లు రావడం లేదని అన్న దాసరి, ఇప్పుడు హీరోయిన్లు వస్తుంటే భాష పేరుతో నిబంధనలు పెట్టడం సమంజసం కాదని, నిజానికి ప్రస్తుత తరంలో ఉన్న తెలుగు హీరోలే స్వచ్చమైన తెలుగు మాట్లాడలేరని, అలాంటప్పుడు ఎక్కడో పొరుగు రాష్ట్రాల నుండి వస్తున్న హీరోయిన్లు ఒక్కసారిగా ఎలా తెలుగు మాట్లాడతారన్న వాదన బలంగా వినపడుతోంది.

ఇదే సమయంలో… పొరుగు రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో మాత్రం హీరోయిన్లు అందరూ తమిళంలోనే మాట్లాడతారని, మరి అలాంటప్పుడు తెలుగులో కూడా ఇలాంటివి అమలు చేయకపోతే, మన భాషపై మనమే పట్టు కోల్పోయిన వారమవుతామని కూడా అంటున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ స్థానంలో ఉన్న హీరోయిన్లు అనుష్క, సమంత, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితర ముద్దుగుమ్మలు అనతి కాలంలోనే తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్న వైనం తెలిసిందే. దీంతో ఈ సారి వీరి తరపున వకాల్తా పుచ్చుకుని ఏ హీరో తెరపైకి వస్తారో చూడాలి… అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.