Dasari Narayana Rao comments Pawan Kalyan - Mahesh Babuఇటీవల కాలంలో డబ్బింగ్ సినిమా ప్రచారాలకు దూరంగా ఉంటూ వస్తున్న ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు, చాలాకాలం తర్వాత ‘మాంజ’ అనే డబ్బింగ్ సినిమా ఆడియో వేడుకకు విచ్చేసారు. అయితే తానూ డబ్బింగ్ సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్న విషయాన్ని కూడా సవివరంగా తెలిపారు. ‘డబ్బింగ్ సినిమాలంటే తనకేమి ద్వేషం లేదని, కానీ, డబ్బింగ్ సినిమాల ప్రభావం తెలుగు సినిమాలపై బాగా పడిందని’ ఆవేదన వెలిబుచ్చారు.

ఇటీవల ఒక్క డబ్బింగ్ సినిమా సూపర్ హిట్ అయ్యిందని, ఇక్కడ తెలుగులో రెగ్యులర్ గా సినిమాలను నిర్మించే నిర్మాతలు కూడా, అక్కడ కొత్తగా కొబ్బరికాయ కొట్టే సినిమాలకు అడ్వాన్స్ లు ఇస్తున్నారని అన్నారు. మన స్టార్ హీరోలుగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోల సినిమాలకు కూడా డబ్బింగ్ హక్కులు 50, 60 లక్షలు దాటలేకపోతుండగా, ఇక చిన్న హీరోల సినిమాలైతే ఒక లక్ష రూపాయలకు సరిపెట్టేయడం జరుగుతోందని, అదే తమిళ డబ్బింగ్ సినిమాల పరిస్థితికి వస్తే… కోటి రూపాయల నుండి 32, 38 కోట్ల వరకు పెడుతున్నారని… తెలుగు సినీ నిర్మాతలను ఏకరువు పెట్టారు.

చిన్న సినిమాల స్థానాన్ని డబ్బింగ్ సినిమాలు ఆక్రమించుకుని, చిన్న సినిమాలకు స్క్రీన్లు లేకుండా చేస్తున్నాయని, ఇందు కోసమే తానూ డబ్బింగ్ సినిమాల వైపు చూడడం లేదని, ఎలాంటి సినీ ప్రమోషన్స్ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని తెలిపారు. అయితే ఈ సినిమాకు హాజరైన కారణం కూడా… 9 సంవత్సరాల వయసు నుండి దర్శకత్వం వహిస్తున్న కిషన్ ఎస్ ఎస్ ను చూసి వచ్చానని స్పష్టం చేసారు. ఈ ‘మాంజ’ సినిమాను తానూ చూశానని, నిజంగా చాలా కొత్తగా ఉంటుందని, ఓ నలుగురు కుర్రాళ్ళ కధగా సినిమా గురించి చెప్పుకొచ్చారు.

అయితే, డబ్బింగ్ సినిమాల హక్కులపై దాసరి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలను ఆలోచింపచేస్తున్నాయి. మన టాప్ హీరోలైన మహేష్, పవన్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ తదితరుల సినిమాలకు కూడా ఇవ్వని మొత్తాన్ని, అక్కడ కొత్త హీరోలకు, ఊరు పేరు లేని హీరోల సినిమాలకు కూడా తెలుగు నిర్మాతలు పెద్ద మొత్తంలో చెల్లించడం పట్ల దాసరి ఆవేదన సరైనదేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎంతో కాలంగా తెలుగు సినీ నిర్మాతలకు అలవాటైపోయిన ఈ ‘డబ్బింగ్’ ఒరవడికి ‘శుభంకార్డు’ పడే అవకాశం ఉందంటారా?!