dasari narayana rao - brahmostavamగత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో సంచలన వ్యాఖ్యలకు నిలయంగా నిలుస్తున్న ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు తాజాగా మరోసారి అగ్ర హీరోలను టార్గెట్ చేసుకున్నారు. పెద్ద సినిమాలు విడుదలైన ప్రతి సమయంలో ఏదొక సందర్భంలో స్పందించే దాసరి, తాజాగా భారీ సినిమాలకు ఇస్తున్న సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలపై దుమారం లేపే వ్యాఖ్యలు చేసారు.

పెద్ద చిత్రాలకు అసలు ప్రమోషన్లు ఎందుకని, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా ‘స్టార్’ హీరోలకు లేదా? అంటూ ప్రశ్నించారు దాసరి. చిత్రం విడుదలకు ముందే ఆకట్టుకునే ట్రైలర్లు, భారీ ఎత్తున వేడుకలు జరుపుతున్నారని, దీంతో సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయని వెల్లడించిన దాసరి, ఆపై సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైతే హీరోలు తిరిగి డబ్బులు చెల్లించే పరిస్థితి వస్తోందని అన్నారు. ఈ పరిస్థితి మారాలని తానూ కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘కొత్త కొత్తగా ఉన్నది’ ఆడియో వేడుక సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇవి.

సినిమా పేరు, హీరో పేరు ఎత్తకున్నా… ఇండస్ట్రీ పెద్దగా ఉన్న దాసరి నారాయణరావు ఏ సినిమాను ఉద్దేశించి మాట్లాడారో ఇప్పటికే అందరికీ అర్ధమై ఉంటుంది. ఇటీవల భారీ అంచనాలతో విడుదలై, బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం చవిచూసిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఉదంతంలో దాసరి చేసిన వ్యాఖ్యలు సరిగ్గా సరిపోతాయి. రిలీజ్ కు ముందు హైప్, భారీ ప్రమోషన్స్, తర్వాత సినిమా పరాజయం, హీరో డబ్బులు తిరిగి ఇవ్వడం… ఇవన్నీ ‘బ్రహ్మోత్సవం’ను ఉద్దేశించే చేసారని ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

దాసరి గారు చేసిన వ్యాఖ్యలలో తప్పు లేదు గానీ, ప్రమోషన్స్ విషయంలో గతంలోనే ఇదే దాసరి గారు హీరోహీరోయిన్లపై తీవ్ర ఆరోపణలు చేసారు. కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్లు తీసుకునే అగ్ర నటీనటులు, సినిమా ప్రమోషన్స్ కు రమ్మంటే మాత్రం మొహం చాటేస్తారని తీవ్రంగా మండిపడ్డారు. నిజానికి అప్పట్లో పరిస్థితి అలాగే ఉండేది. మరి నాటి నుండి నేటివరకు పరిస్థితులను గమనిస్తే… ఎప్పుడూ ప్రమోషన్స్ కు రానటువంటి పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న వైనం తెలిసిందే. మరి ఒకే మనిషి నుండి రెండు మాటలు ఏల..?