Dasari-Kiran-Kumar-Takes-Oath-As-TTD-Board-Memberప్రముఖ నిర్మాత, వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరికి సన్నిహితుడు దాసరి కిరణ్ కుమార్‌ సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడుగా పదవీ ప్రమాణం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలిలో ఇప్పటికే 23 మంది సభ్యులున్నారు. దాసరి కిరణ్ కుమార్‌తో కలిపి 24 అయ్యిందిప్పుడు. టీటీడీ డిప్యూటీ ఈవో రమేష్ బాబు నిన్న ఉదయం స్వామివారి ఆలయం బంగారు వాకిలి వెలుపల ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించి, స్వామివారి తీర్ధ ప్రసాదాలు, చిత్రపఠం అందించారు.

ఆలయ పూజారుల ఆశీర్వాదం తీసుకొన్న తర్వాత దాసరి కిరణ్ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ, “నాకు సిఎం జగన్మోహన్ రెడ్డి అన్నా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నా చాలా అభిమానం. సిఎం జగన్మోహన్ రెడ్డి నా విధేయతని గుర్తించి టీటీడీలో నాకు ఈ పదవి కల్పించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.

కొన్ని రోజుల క్రితం దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా శపధం, వ్యూహం అనే రెండు సినిమాలు తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలకు ముందు విడుదల కాబోయే ఆ రెండు సినిమాలని దాసరి కిరణ్ కుమారే నిర్మించబోతున్నారు. బహుశః అందుకు ప్రతిగానే ఆయనకి ఈ పదవి లభించి ఉండవచ్చు.

ఇప్పటికే టీటీడీ బోర్డు వైసీపీ నేతలతో నిండిపోయింది. ఇక తిరుమలపైకి మంత్రులు, ఎమ్మెల్యేల దండయాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి. తరచూ అనేకమంది అనుకహృలను వెంటబెట్టుకొని వచ్చి ఆలయంలో దూరిపోయి హడావుడి చేస్తూనే ఉన్నారు. తిరుమలకి వచ్చే ఆదాయం నుంచి కొంత అన్యమతాలకు కేటాయింపులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోట్లాది హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలని రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం చాలా బాధాకరమే.