danger bells for jaganఏపీ రాజకీయాలలో షర్మిల ప్రవేశించే రోజు అతి దగ్గరలోనే ఉండొచ్చు – ఇది ఓపెన్ విత్ ఆర్కే కార్యక్రమంలో రఘురామకృష్ణంరాజు వ్యక్తపరిచిన అభిప్రాయం. అలాగే వీకెండ్ విత్ ఆర్కే కధనంలో కూడా తన సోదరుడికి గుణపాఠం నేర్పడానికి ఏపీ రాజకీయాలలో షర్మిల రావచ్చని పేర్కొన్నారు.

కట్ చేస్తే కొత్త ఏడాదిలో షర్మిల ఇచ్చిన ‘హింట్’ వైరల్ అయ్యింది. ‘ఎవరు ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టొచ్చు, ఏపీలో పెట్టకూడదని రూల్ ఏం లేదుగా’ అన్న షర్మిల వ్యాఖ్యలు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను తీసుకువచ్చాయి. ఓ విధంగా చెప్పాలంటే ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే అంశంగా మీడియా వర్గాలు చర్చలు జరుపుతున్నాయి.

తన సోదరుడు జగన్ కు పరోక్షంగా హింట్ ఇచ్చారో ఏమో గానీ, ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే, రాజకీయంగా జగన్ కు అత్యంత ప్రమాదకరమైన విషయంగా మారనుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పటివరకు జగన్ రాజకీయ బలమంతా సామాజిక వర్గం + మత వర్గం. షర్మిల ఏపీలోకి ప్రవేశిస్తే, ఈ రెండింటిలో చీలిక రావడం ఖాయమనే చెప్పాలి.

ఇది రాజకీయంగా షర్మిల ఎదుగుదలకు కారణం కాకపోవచ్చు గానీ, గత ఎన్నికలలో జనసేన పోషించిన పాత్రను షర్మిల పోషించవచ్చు. జనసేన రాజకీయంగా ఎదగలేకపోయినా, తెలుగుదేశంను అధికారం నుండి దూరం చేయడంలో విజయవంతం అయ్యింది. రేపు షర్మిల ఏపీలోకి ప్రవేశిస్తే కూడా అలాంటి పరిణామాలే జరగవచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

వైసీపీకి ఉన్న ఓట్ల శాతంలో చీలిక తీసుకురావడం ద్వారా జగన్ కు అధికారాన్ని దూరం చేయడంలో సక్సెస్ కావచ్చు గానీ, తన కొత్తగా స్థాపించిన పార్టీకి ఏదో లబ్ది చేకూరుతుందని భావిస్తే మాత్రం ‘జనసేన’ మాదిరే భంగపాటుకు గురికాక తప్పదు. ఈ విషయం షర్మిలకు కూడా తెలుసన్నది పొలిటికల్ వర్గాల టాక్. కేవలం జగన్ కు గుణపాఠం చెప్పడానికి తప్ప, ఏపీలో అధికారంలోకి షర్మిల వచ్చేస్తోందని ఇప్పుడే కలలు కనడం లేదన్నది లేటెస్ట్ విశ్లేషణలు.

ఇదిలా ఉంటే గడిచిన రెండు, మూడు నెలలుగా రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. మొన్నటివరకు తనవైపు మాట్లాడిన ఉండవల్లి లాంటి వారు కూడా బహిరంగంగా జగన్ పాలనను తూర్పారపడుతున్నారు. అలాగే బెయిల్ రద్దు వ్యవహారం మరియు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యే అంశం కూడా జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. దీనికి తోడు ఇపుడు సోదరి షర్మిల రూపంలో మరో పొలిటికల్ స్టంట్ ను జగన్ ఎదుర్కొనే స్థితిలో ఉన్నారా?