Janasena - Pawan Kalyan Wake Upఇటీవలే జరిగిన తిరుపతి ఉపఎన్నికలలో జనసేన, బీజేపీ తరపున నిలబడిన బీజేపీ అభ్యర్థి ఘోర పరాజయం పొందారు. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి. అప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కు మేమే దిక్కు అని భీరాలు పలికిన నాయకులు ఒక్కసారిగా మాయం అయిపోయారు. కనీసం మీడియాలో కూడా కనిపించడం లేదు.

బీజేపీతో పాటు గతంలో టీడీపీని తామే అధికారంలోకి తెచ్చాం అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ కూడా… తన అసలు బలం బయటపడేసరికి మొహం చాటేశారు. తిరుపతి ఉపఎన్నిక తరువాత కరోనా వచ్చి కొంత కాలం వార్తలలో నిలిచారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత అటు మీడియాలో కూడా ఆయన ఊసే లేదు. బహుశా మాట్లాడకపోతే జనాలు ఆ ఓటమిని మర్చిపోతారు అనుకుంటున్నారేమో!

అయితే కరోనా కష్ట కాలంలో ఏవీ తమకు పట్టవు అన్నట్టు వ్యవహరిస్తే తిరుపతి ఓటమి గురించి కాదు… అసలు ఆ పార్టీల గురించే ప్రజలు మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. కేవలం అభిమానులు మాత్రమే ఓటు వేస్తే పవన్ కళ్యాణ్ కూడా గెలిచే పరిస్థితి ఉండదని 2019లోనే తేటతెల్లం అయిపోయింది.

ఇటువంటి వైఖరితో పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ న్యూట్రల్ ప్రజలకు మరింత దూరం అయిపోతున్నారు. టీడీపీ ఓడిపోయింది కదా అని ప్రజలు వేరే పార్టీలకు అవకాశం ఇవ్వరు. ఆయా పార్టీలు టీడీపీ కంటే మెరుగ్గా తమ పక్షాన నిలుస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి అని అనిపిస్తే వారికి మద్దతునిస్తాయి. ఆ మాట మరచిపోయి మేమే ప్రత్యామ్న్యాయం అనుకుంటే మరింత పరాభవం తప్పదు.