dangal-Overseas collectionsబాలీవుడ్ ‘సూపర్ స్టార్’ అమీర్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘దంగల్’ భారతీయ స్క్రీన్లపైనే కాకుండా చైనా వంటి విదేశాలలో సైతం ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆగష్టు 24వ తేదీన హాంకాంగ్‌ లో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా కాసుల వర్షం కురిపిస్తూ… ఏకంగా 23.45 మిలియన్ హాంకాంగ్ డాలర్ల (దాదాపు 19.5 కోట్లు) వసూలుతో రికార్డులు బ్రేక్ చేసింది. 2009లో విడుదలైన అమీర్ సినిమా ‘3 ఇడియట్స్’ హాంకాంగ్‌ లో 23.41 మిలియన్ హాంకాంగ్ డాలర్లు వసూలు చేయగా, తాజాగా “దంగల్” దానిని అధిగమించింది.

హాంకాంగ్, మచ్చులలో మొత్తం 46 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, సాధారణంగా బాలీవుడ్ సినిమాలు విడుదలయ్యే దానికి ఇది నాలుగు రెట్లు అధికమని డిస్నీ ఇండియా స్టూడియోస్ ఉపాధ్యక్షుడు అమృతపాండే తెలిపారు. అమెచ్యూర్ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ కధలో ఆయన తన ఇద్దరు కుమార్తెలు గీతా ఫొగట్, బబిత కుమారిలను ప్రపంచ స్థాయి రెజ్లర్లుగా తీర్చిదిద్దారు. దంగల్ ఇప్పటి వరకు విదేశాల్లో 217.17 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, భారత్‌ తో కలిపి ప్రపంచవ్యాప్తంగా 297.68 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది.