Dangal girl Zaira Wasim Minister Vijay Goel Controversy‘మిస్టర్ పర్ ఫెక్ట్’ అమీర్ ఖాన్ “దంగ‌ల్” సినిమాతో బాల‌న‌టిగా మారిన జైరా వ‌సీం చుట్టూ ముసురుకుంటున్న వివాదాలకు తెర‌పడేలా కనపడడం లేదు. కాశ్మీర్‌లో జైరాకు వ్య‌తిరేకంగా పెల్లుబికిన నిర‌స‌న‌లు ముగియ‌క‌ ముందే కేంద్ర‌మంత్రి విజ‌య్ గోయ‌ల్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. పంజరంలో బందీగా ఉన్న ముస్లిం యువ‌తి న‌గ్న చిత్రాన్ని ట్విట్ట‌ర్‌లో పోస్టు చేస్తూ… ప్ర‌స్తుతం జైరా ప‌రిస్థితి కూడా ఇలా ఉంద‌ని వివాదాస్పద కామెంట్ చేశారు. క్రీడ‌ల మంత్రి చేసిన ఈ ట్వీట్‌కు జైరా ఘాటుగా స్పందించింది.

ఆ బొమ్మ‌కీ, త‌న‌కీ ఉన్న సారూప‌త్య‌త ఏమిటో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని, బుర‌ఖా ధ‌రించిన ముస్లిం మ‌హిళ‌లు అందంగానే కాదు, స్వేచ్ఛ‌గా కూడా ఉంటారనే విషయం మంత్రికి తెలియ‌జేయాల‌నుకుంటున్నానంటూ ఘాటుగా బ‌దులిచ్చింది. జైరా స్పంద‌న‌కు ఉలిక్కి పడిన మంత్రి మ‌రో ట్వీట్ చేస్తూ… త‌న ఉద్దేశాన్ని జైరా త‌ప్పుగా అర్థం చేసుకుంద‌న్నారు. చిన్న‌ వ‌య‌సులోనే ఎంతో సాధించిన జైరాలాగే బాలిక‌లంద‌రూ క‌ట్టుబాట్లు, నిబంధ‌న‌ల‌ను దాటుకుని ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గాల‌ని కోరుకుంటున్న‌ట్టు గోయ‌ల్ ఆకాంక్షించారు.