Daggubati Venkateswara Rao Quits Active Politicsమాజీ మంత్రి, ఎన్టీఆర్‌ పెద్దల్లుడు దగ్గుబాటి వెంటేశ్వరరావు, కుమారుడు హితేష్ ఇద్దరూ రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్నప్పుడు ఆయన అభిమానులని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఎమ్మెల్యేగా, మంత్రిగా నేను నా శక్తిమేర ప్రజలకి సేవ చేశాను. అందుకు నేను చాలా తృప్తిగా ఉన్నాను. ఒకప్పుడున్న రాజకీయాలు ఇప్పుడు లేవు. పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు డబ్బు, పదవులు, రాజకీయ కక్ష సాధింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలే సాగుతున్నాయి. వీటిలో నేను, నా కుమారుడు ఇమడలేమని భావించి తప్పుకోవాలని నిర్ణయించాము. రాజకీయాల నుంచి తప్పుకొన్నా మా సమాజాసేవా కార్యక్రమాలు యదాతదంగా కొనగిస్తాము,” అని చెప్పారు.

ఎన్టీఆర్‌ టిడిపిని స్థాపించినప్పుడు దగ్గుబాటి వెంటేశ్వరరావు పార్టీలో చాలా కీలకపాత్ర పోషించారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి లోక్‌సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా చేశారు. చంద్రబాబు నాయుడుతో విభేధాలు ఏర్పడిన తర్వాత బిజెపిలో చేరారు. ఆ తర్వాత వైఎసార్ కాంగ్రెస్‌లో చేరారు. 2019లో పర్చూరు నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్ధి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. తన కుమారుడు హితేష్‌ని ప్రత్యక్ష రాజకీయాలలో తెచ్చేందుకు ప్రయత్నించారు కానీ వీలుపడక ఆ ఆలోచన విరమించుకొన్నారు. సుమారు నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాలలో ఉన్న దగ్గుబాటి వైసీపీలో చేరిన 4 ఏళ్ళకే రాజకీయాలపై విరక్తి చెందడం చూస్తే ఆ పార్టీ రాజకీయాలు ఏవిదంగా సాగుతున్నాయో అర్దం చేసుకోవచ్చు. ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్ వంటివారు కూడా తమ పార్టీ వైఖరితో విసుగెత్తిపోయామని బహిరంగంగానే చెపుతున్నారు.

ఈ కారణంగా దగ్గుబాటి వేంకటేశ్వర రావు వైసీపీ నుంచి తప్పుకొని మళ్ళీ టిడిపిలోకి వస్తారని అందరూ భావిస్తుంటే ఆయన ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఆయన భార్య, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం బిజెపిలో కొనసాగుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ పట్ల బిజెపి అలసత్వం ప్రదర్శిస్తుండటంతో పార్టీలో పలువురు నేతల్లాగే ఆమె కూడా మౌనంగా ఉండిపోతున్నారు. ఈ పరిస్థితులలో ఆమె బిజెపిలో కొనసాగుతారా లేక ఆమె కూడా తప్పుకొంటారో?