Daggubati-Venkateswara-Rao-Parchuruప్రకాశం జిల్లా పర్చూరు స్థానం నుంచి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైకాపా నుంచి బరిలోకి దిగడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి ఈ సీటును ఆయన కుమారుడు హితేష్‌కు ఆశించినా.. పౌరసత్వం విషయంలో తలెత్తిన సమస్యతో సాధ్యపడలేదు. కొడుకు సీటు కోసం జగన్ వద్దకు వెళ్ళిన వెంకటేశ్వరరావునే చివరికి బరిలోకి దిగారు. గత ఎన్నికలలో ఆయన పోటీ చెయ్యలేదు. ఇక ఎన్నికల రాజకీయాలు చెయ్యనని ప్రకటించేశారు కూడా. అయితే కొడుకు కోసం మాట మార్చుకున్నారు.

ఇక్కడ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఏలూరి సాంబశివరావు రెండోసారి పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, వైద్య శిబిరాలు ఉపకరిస్తాయని ఆయన భావిస్తున్నారు.
దగ్గుబాటి గెలిస్తే ఏదైనా సమస్య వస్తే హైదరాబాద్ వెళ్ళాలి అదే ఏలూరి గెలుస్తే స్థానికంగానే అందుబాటులో ఉంటారని టీడీపీ గట్టిగా ప్రచారం చేస్తుంది. గడిచిన ఐదు సంవత్సరాలలో ఏలూరి ఆ విషయాన్నీ నిజం చేశారు కూడా . జనసేన మద్దతుతో బీఎస్‌పీ అభ్యర్థిగా పెదపూడి విజయ్‌కుమార్‌ బరిలో ఉన్నా పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి.

ఈ ఎన్నికలు దగ్గుబాటి కుటుంబానికి చాలా కీలకం. పురంధేశ్వరి బీజేపీ తరపున పోటీ చెయ్యడంతో పెద్దగా విజయావకాశాలు లేవు. వెంకటేశ్వరరావు కూడా ఓడిపోతే రాజకీయంగా సమాధి అయిపోయినట్టే. కొడుకు రాజకీయ భవిష్యత్తు మొదలు కాకముందే ఆగిపోతుంది. దీనితో ఈ ఎన్నిక ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హితేష్ అయితే చేతికి ఎముక లేనట్టుగా ఖర్చుపెడుతున్నారని సమాచారం. దీనితో ఈ స్థానం హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. ఎవరు గెలిచినా అతికొద్ది మెజారిటీతోనే గెలుస్తారని అంటున్నారు.