BJP-Purandeswari-ఇంతకాలం ఏపీ బిజెపి నేతలందరూ ఏమైపోయారో… ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. కానీ నేడు ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటనకు వస్తుండటంతో అందరూ ఒక్కసారిగా వచ్చి విశాఖనగరంలో వాలిపోయారు.

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్, బిజెపి ఎంపీ సిఎం రమేష్, బిజెపి నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, నాగభూషణం, రవీందర్ రెడ్డి, చిరంజీవి రెడ్డి తదితరులు గురువారం విశాఖనగరంలోని బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

పురందేశ్వరి మాట్లాడుతూ, “ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన శరత్ చంద్రరెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి, వైసీపీలో నేతలకి మద్య ఎటువంటి ఆర్ధిక, వ్యాపార సంబందాలున్నాయో చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటనను జగన్ ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తుండటం దౌర్భాగ్యమే. ప్రధాని పర్యటన కోసం దుకాణాలు కూల్చివేయడాన్ని బిజెపి ఖండిస్తోంది,” అని అన్నారు.

బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ, “వైఎస్ హయాంలో రాష్ట్రంలో కబ్జాలకు పాల్పడిన “కడప కబ్జా గ్యాంగ్’ గత కొన్ని నెలలుగా విశాఖలోనే మకాం వేసింది. వారిలో సిఎం జగన్మోహన్ రెడ్డి అనుచరుడు కృష్ణ కూడా ప్రస్తుతం విశాఖలోనే మకాం వేశారు. ఇదివరకు విజయమ్మ విశాఖ నుంచి లోక్‌సభకు పోటీచేసినప్పుడు, ఆమెని గెలిపిస్తే కడప కబ్జా గ్యాంగులు విశాఖకు వచ్చేసి కబ్జాలు చేస్తాయనే భయంతోనే ప్రజలు ఆమెను ఓడించారు. కానీ ఇప్పుడు విశాఖలో ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పధకం పేరుతో భూముల రీసర్వే చేసి విశాఖలో మిగిలిన భూములను కాజేయడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. వారికి కావలసిన ప్రాంతాలను 22ఏ కింద నిషేధిత ప్రాంతాల జాబితాలో చేర్చి వాటిని వివాదాలలో ఉన్న భూములుగా చూపించి వైసీపీ నేతలు పంచేసుకొంటున్నారు. ఇందుకు దసపల్లా భూముల వ్యవహారమే ఉదాహరణ. కనుక విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొర్తున్నాను,” అని అన్నారు.

ఎంపీ సిఎం రమేష్ మాట్లాడుతూ, “ఇతర జిల్లాల నుంచి విశాఖలో దిగుతున్న కొందరు వైసీపీ నేతలు నగరంలోని విలువైన భూములను కొట్టేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ నేతలు నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి, భయపెట్టి వారి స్థలాలను బలవంతంగా గుంజుకొని వాటిలో బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లు, విల్లాలను నిర్మించి అమ్ముకొంటున్నారు. ఈ భూకబ్జాల వెనుక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్ర రెడ్డి కూడా ఉన్నారు. ఈడీ అధికారులు ఆయనని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో నిన్న అరెస్ట్ చేసారు. వారి విచారణలో ఆ కుంభకోణంతో పాటు విశాఖలో భూకబ్జాల వ్యవహారం కూడా బయటపడుతుంది. వాటిపై కూడా ఈడీ విచారణ చేపట్టనుంది. కనుక వైసీపీ నేతలు వివాదాస్పద భూములలో నిర్మించి అమ్ముతున్న ఇళ్ళను ఎవరూ కొనుగోలుచేయవద్దని నేను విశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

వైసీపీ నేతలు విశాఖలో దౌర్జన్యాలకు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి గొంతుచించుకొని చెపుతున్న ఏపీ బిజెపి నేతలు ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు?ఎందుకు అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు? మూడు రాజధానుల పేరుతో ప్రజల మద్య ప్రాంతీయ విభేధాలు రెచ్చగొడుతుంటే ఏపీ బిజెపి నేతలు ఎక్కడున్నారు? ఎందుకు మాట్లాడలేదు? వారి మిత్రపక్ష నేత పవన్‌ కళ్యాణ్‌ని విశాఖ హోటల్‌ గదిలో రెండు రోజులు నిర్బందిస్తే ఎందుకు మాట్లాడలేదు?అమరావతికే కట్టుబడి ఉన్నామని చెపుతున్నప్పుడు అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్న రైతులపై వైసీపీ దాడులు చేస్తున్నప్పుడు ఈ బిజెపి నేతలందరూ ఎక్క్దున్నారు?ఎందుకు నోరు విప్పలేదు?ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేసినప్పుడు వీరందరూ ఎక్కడున్నారు? ఎందుకు ఖండించలేదు?

ప్రధాని నరేంద్రమోడీ విశాఖకు వస్తున్నారు కనుక ఇప్పుడు అందరూ హటాత్తుగా విశాఖలో వాలిపోయి పోటీలు పడి మాట్లాడుతున్నారు. మళ్ళీ రేపు ప్రధాని వెళ్లిపోగానే అందరూ మాయం అయిపోతారు. ఆంధ్రప్రదేశ్‌ పట్ల ఏమాత్రం ఆసక్తి, నిబద్దత, ప్రేమాభిమానాలు లేని బిజెపి నేతలు వైసీపీ నేతలతో సమానమే కదా?