Daggubati Purandeswari  says BJP will allaince with TRSబీజేపీ మహిళమొర్చా జాతీయ నాయకురాలు పురందేశ్వరి అనంతపురం జిల్లా పెనుకొండకు ఒక పార్టీ కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలో ఎప్పటి లానే కేంద్రం రాష్ట్రానికి అన్నీ చేసేసింది అన్నీ ఇచ్చేసింది అని ఆవిడ ప్రకటించేశారు. పోలవరం ప్రాజేక్టు నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇవ్వకుండానే పనులు జరుగుతున్నాయా? అని పురంధేశ్వరి ప్రశ్నించారు. కొంత జాప్యం జరగవచ్చు కానీ.. నిధులు ఇస్తున్నారు కదా అని ఆమె అన్నారు. ఇదే క్రమంలో టీడీపీ కాంగ్రెస్ పొత్తుపై విరుచుకుపడ్డారు ఆమె.

తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుపై చంద్రబాబు ఏం చెప్తారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ ను ఆపడానికి తెలంగాణాలో అవసరమైతే తెరాసకు మద్దతు ఇస్తామని అయితే ఆ పార్టీ ఎంఐఎంను వదులుకోవాలని ఆవిడ చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఎలా ఉన్నా ఆవిడ కాంగ్రెస్ పై ఇంకో వ్యాఖ్య చేశారు. రాష్ట్రానికి చేసిన అన్యాయానికి ఏపీలో కాంగ్రెస్‌ నేతలను తిరగనివ్వబోమని పురంధేశ్వరి స్పష్టం చేశారు. విభజన బిల్లు రూపొందిన నాటి నుండి ఆమోదించే వరకు ఆమె కాంగ్రెస్ పంచనే ఉన్నారు ఆ తరువాత కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని పార్టీ మారారు

ఇప్పుడు ఏదో తనకు తెలీకుండానే జరిగి పోయినట్టే చెబుతున్నారు. అది కూడా పక్కన పెడితే అసలు బీజేపీ వారు కాంగ్రెస్ వారిని తిరగనివ్వకపోవడం ఏంటి? బీజేపీ ఇచ్చిన సంపూర్ణ మద్దతుతోనే కదా విభజన బిల్లు పాస్ అయ్యింది? బీజేపీ మద్దతు లేకపోతే ఖచ్చితంగా బిల్లు రాజ్యసభలో ఆగిపోయేది. అది కూడా కాదు అసలు కాంగ్రెస్ వారిని తిరగినివ్వకుండా చేసే అంతటి క్యాడర్ బీజేపీకి ఆంధ్రలో ఉందా? రాష్ట్రానికి అన్యాయం చేసిన తరువాత ఆ పార్టీ కాంగ్రెస్ కంటే అద్వాన్న స్థితిలో ఉంది. స్వయంగా అమిత్ షా మీదా, రాష్ట్ర పార్టీ అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణపైనే దాడులు జరిగాయి. దానికి కనీసం నిరసనలు కూడా జరగలేదు. అది ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి. అది మర్చిపోయి ఏవేవో డైలాగులు వేస్తున్నారు పురంధేశ్వరి గారు.