Daggubati Purandeswariకాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కాస్త సబ్జెక్ట్ తో కూడిన ప్రసంగాలు చేయడంలో పురంధేశ్వరి ముందు వరుసలో ఉండేవారు. దీంతో విజ్ఞత, వినయం కలగలిసిన నేతగా పురంధేశ్వరికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అలాగే ఎన్టీఆర్ కుమార్తెగానే కాక, స్వయం ప్రతిపత్తి గల నేతగా ప్రజల్లో కూడా ఎంతో కొంత తన ముద్రను అయితే ఏర్పరచుకుంది. రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే… ఆ సీట్లో కూర్చోపెట్టేందుకు అధిష్టానం పురంధేశ్వరి పేరును కూడా పరిశీలించిందన్న వార్తలు అప్పట్లో హల్చల్ చేసాయి. అయితే, ఆ తర్వాత బిజెపిలో చేరడం… ప్రజాక్షేత్రంలో ఓడిపోవడం… రెండూ జరిగిపోయాయి.

బిజెపిలో చేరిన మరుక్షణం నుండి పురంధేశ్వరి రాజకీయ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి మించిన విధేయతను బిజెపి పెద్దలకు ప్రదర్శిస్తోందని ఆమె చేస్తున్న వ్యాఖ్యలే చెబుతున్నాయి. పోలవరం నిధుల కేటాయింపుల నుండి, రాజధాని నిర్మాణం తదితర విషయాలలో పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఒక్క టిడిపి వర్గాలకే కాదు, ఏపీ ప్రజల ఆగ్రహానికి కూడా గురయ్యాయి. కేంద్రం ఎన్ని కోట్లైనా నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వమే అలసత్వం ప్రదర్శిస్తోంది అన్న విధంగా వ్యాఖ్యానించిన పురంధేశ్వరి వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి.

తాజాగా మరోసారి బిజెపికి తన విధేయతను ప్రదర్శించే విధంగా సంచలన వ్యాఖ్యలకు తెరలేపింది. రాజ్యసభ సీట్ల కేటాయింపులో భాగంగా ఏపీలో టిడిపికి దక్కిన మూడు సీట్లలో ఒక దానిని బిజెపికి కేటాయించింది టిడిపి. అయితే ఈ సీట్ ను తమకు ఇవ్వాలని కోరలేదని పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా నిలిచాయి. మరి టిడిపి ఎందుకు ఇచ్చినట్లు? వారికి రాష్ట్రంలో నేతలు కరువయ్యారా? ఇది వింటే ఎవరికైనా హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరిన మేరకు రైల్వేమంత్రికి రాజ్యసభను కేటాయించామని టిడిపి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఒకవేళ పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలే నిజమైతే… ఇవే వ్యాఖ్యలను రెండు రోజుల క్రితం వరకు ఎందుకు చేయలేదు? రాజ్యసభ నామినేషన్ పూర్తయ్యాక మాత్రమే ఇలాంటి మాటలు ఎందుకు వచ్చాయో? దాని భావమేమిటో రాజకీయ విజ్ఞులకు విదితమే. ‘ఏరు దాటాక తెప్ప తగలేయడమంటే’ ఇదే కదా..! ఇటీవల కాలంలో పురంధేశ్వరి చేస్తున్న వ్యాఖ్యలకు రాజకీయాలలో ఎలాంటి చర్చ జరుగుతున్నప్పటికీ, సాధారణ ప్రజానీకంలో మాత్రం ఒక విధమైన చీదరింపు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. విభజన జరిగిన నాటి నుండి తనలోకి సరికొత్త యాంగిల్ ను ప్రజలకు పరిచయం చేయడంతోనే ఇలాంటి భావనలు బయటకు వస్తున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట.