Daggubati Purandeshwari“ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన పార్టీలతోనే ఎందుకుంటున్నారు?” ఇది మా ప్రశ్న కాదు. ఓ ఓటర్ బిజెపి నేత పురంధీశ్వరిని అడిగిన ప్రశ్న. కర్ణాటక ఎన్నికల నేపధ్యంలో… ప్రధాని మోడీ నుండి చోటామోటా నాయకుల వరకు అందరూ ప్రచార పర్వానికి తెరలేపారు. ఈ సందర్భంలో రాయచూరు జిల్లాలో ప్రచారం నిర్వహిస్తోన్న పురంధీశ్వరిని ఓ తెలుగు వ్యక్తి ఊపిరి సలపనివ్వని ప్రశ్నను సంధించాడు.

‘అమ్మా… గత ఎన్నికలలో ఇక్కడకు వచ్చి కాంగ్రెస్ కు ఓటేయమన్నారు… ఇప్పుడు వచ్చి బిజెపికి ఓటేయమంటున్నారు. ఏపీకి అన్యాయం చేసే పార్టీలతోనే ఎప్పుడు ఎందుకుంటున్నారమ్మా?’ అంటూ అవాక్కయ్యే ప్రశ్న వేసాడు. బిజెపి నేత సమాధానం ఇచ్చుకునే లోపే… ‘మాది గుడివాడ, మీ నాన్న గారు పార్టీ స్థాపించినపుడు జెండా మోసా, ఆ అభిమానంతోనే అడుగుతున్నా, వేరొకర్ని అయితే అడిగేవాడ్ని కాదు’ అంటూ మరో మాట అన్నారు.

సహజంగా మంచి వక్త అయిన పురంధీశ్వరి ఈ ఊహించని ప్రశ్నకు మాత్రం సరైన జవాబు ఇచ్చుకోలేకపోయారు. ‘న్యాయం చేసే పార్టీలకే ఓటు వేయాలని, తనది రాజకీయం కాదని’ ఓ ముక్క చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయినట్లుగా సమాచారం. ఇలా అడుగడుగునా బిజెపికి ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నాయి కాబట్టే, ప్రధాని మోడీ కూడా జేడీఎస్ సాన్నిహిత్యం కోరుకుంటున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాటలు.