Dadisetty-Raja-Bad-Roads-In-Andhra-Pradeshఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు గుంతలు పడిన రోడ్లు రాష్ట్ర పరిస్థితికి అద్దం పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిత్యం సోషల్ మీడియాలో రోడ్ల దయనీయ స్థితిని కళ్ళకు కట్టేట్లు ఫోటోలు, వీడియోలు పెడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న పట్టించుకొనే నాధుడే లేడు. మూడు రాజధానులు ఏర్పాటైతేనే రాష్ట్రంలో రోడ్లు గుంతలు పూడూస్తారేమో?అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నా మంత్రులు మాత్రం మూడు రాజధానుల పాటే పాడుతూ కాలక్షేపం చేసేస్తున్నారు.

ఏపీలో రోడ్లు భవనాలశాఖ మంత్రిగా నేనున్నానని గుర్తు చేస్తున్నట్లు మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వర రావు (రాజా) ఇనాళ్ళకు ఈ సమస్యపై స్పందించారు. అయితే ఆయన స్పందన చాలా విడ్డూరంగా ఉంది. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో రోడ్లు బాగానే ఉన్నాయి. వాటిని టిడిపి వాళ్ళే తవ్వేసి పాడుచేస్తూ ఎల్లో మీడియా సాయంతో మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. రోడ్లు మరమత్తులనేవి నిరంతర ప్రక్రియ. వర్షాకాలం ముగియగానే రూ.1500 కోట్లతో రాష్ట్రంలో రోడ్లన్నీ మరమత్తులు చేయిస్తాము,” అని అన్నారు.

రాష్ట్రంలో కొత్త రోడ్లు వేయించకపోగా కనీసం గుంతలు పడినవాటిని కూడా పూడ్చలేకపోతున్న వైసీపీ ప్రభుత్వం దీనికీ టిడిపిని, మీడియాని నిందించడం సిగ్గుచేటు. టిడిపి నేతలు అన్నా క్యాంటీన్లు పెట్టి పేద ప్రజలకు ఉచితంగా అన్నం పెడితేనే వైసీపీ నేతలు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అడ్డుకొంటున్నప్పుడు, టిడిపి వాళ్ళు రోడ్లను తవ్వేస్తుంటే అడ్డుకోకుండా చూస్తూ ఊరుకొన్నారెందుకు? అయినా రాష్ట్రంలో చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు గల వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లన్నిటినీ టిడిపి వాళ్ళు తవ్వేయగలరా?ఇటువంటి విధ్వసకరమైన ఆలోచనలు వైసీపీ నేతలకే ఎందుకు వస్తాయో తెలీదు? నారా లోకేష్‌ వంటి టిడిపి నేతలు సొంత డబ్బుతో రోడ్ల మీద గుంతలు పూడ్చేందుకు ప్రయత్నిస్తే వారిని పోలీసులు అడ్డుకోవడం రోడ్లు భవనాల శాఖ మంత్రిగారికి తెలియదా?

అయినా రోడ్ల గుంతలే పూడ్చలేని ప్రభుత్వం వేలకోట్లు ఖర్చయ్యే మూడు రాజధానులను ఏవిదంగా నిర్మిస్తుంది?ఎలాగూ మూడు రాజధానులు-వికేంద్రీకరణను కూడా టిడిపియే అడ్డుకోంటోందని ఆరోపిస్తూ మూడున్నరేళ్ళు కాలక్షేపం చేసేశారు. కనుక వచ్చే ఎన్నికల వరకు ఈవిదంగానే కాలక్షేపం చేసేయడం ఖాయమే అని భావించవచ్చు. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. అనుకొంటున్నారేమో? ఇదీ ఒకందుకు మంచిదే! ఎందుకంటే మూడు రాజధానుల కోసం వేలకోట్లు ఖర్చు చేసేసిన తర్వాత ప్రభుత్వం మారి మళ్ళీ అమరావతి రాజధాని అంటే ఆ సొమ్మంతా వృధా అయిపోతుంది కదా?