dadi-veerabhadra-rao-reveals-sr-ntr-lakshmi-parvathi-un-known-detailsఒక నటుడుగా నందమూరి తారక రామారావు ఎంతటి ప్రభావం చూపారో, రాజకీయ నాయకుడిగా అంతకు మించిన ప్రభావాన్ని ప్రజల్లో కలిగించారు. అయితే లక్ష్మీ పార్వతితో కలిసి రెండవ వివాహం చేసుకున్న తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు అందరికీ తెలిసినవి కావు. బయటకు ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఎన్టీఆర్ కు సన్నిహితులుగా ఉన్న కొందరి వరకే పరిమితమయ్యాయి. అలాంటి సన్నిహితుల జాబితాలో ఆనాడు ఎన్టీఆర్ కు చేదోడు వాదోడుగా మెలిగిన వారలలో దాడి వీరభద్రరావు ఒకరు.

వివాహం తర్వాత పాలనా పరమైన అంశాల్లో, పార్టీకి సంబంధించిన కీలక విషయాల్లో లక్ష్మీ పార్వతి జోక్యం ఎక్కువగా ఉంటుందన్న ఆరోపణలు తెలిసినవే. అయితే నిజంగానే లక్ష్మీ పార్వతి చెప్పినట్లే ఎన్టీఆర్ పాలన చేసారా? ఆమె చెప్పిన వారికే సీట్ల పంపిణీ జరిగిందా? అంటే దానికి కొంత సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసారు దాడి. వివాహానంతరం అడ్మినిస్ట్రేషన్ లో లక్ష్మీ పార్వతి కలుగజేసుకుంటున్నారని ఆమె వ్యతిరేక వర్గం ఆరోపణ అని, ఆమె చెబితే ఎన్టీఆర్ ఎందుకు నిర్ణయాలు తీసుకుంటానని, ఒకరు చెబితే నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం ఆయనది కాదని అన్నారు.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే… కొన్ని సందర్భాల్లో లక్ష్మీ పార్వతి ఏదైనా చెబితే… ఆమెకు వ్యతిరేకంగా తాము ఏదైనా సలహా ఇస్తే, మా సలహానే పాటించేవారని తేల్చి చెప్పారు. “లక్ష్మీ పార్వతి చెప్పినట్టు ఎన్టీఆర్ ఏ రోజు చేయలేదని, అలా ఒకరు చెబితే చేసే వ్యక్తిత్వం ఎన్టీఆర్ ది కాదని” స్పష్టం చేసారు దాడి. అయితే ఎన్టీఆర్ జీవితంలో తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయని, అది అందరికీ తెలియాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకే ఎన్టీఆర్ పై తెలుగు, ఇంగ్లీష్ భాషలలో తానొక పుస్తకం రాస్తున్నానని, దేశంలోనే అనేక సంక్షేమ పధకాలకు నాంది పలికిన ఎన్టీఆర్ జీవితాన్ని పరిపూర్ణంగా ఈ పుస్తకం ద్వారా చెప్పనున్నానని తెలిపారు ఈ సీనియర్ రాజకీయ నాయకుడు.