Dadi Veerabhadra Rao ఎన్టీఆర్ జీవితంలో వైశ్రాయ్ ఉదంతాన్ని ప్రస్తావించకుండా ఉండలేం. ఎన్టీఆర్ జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటనగా మిగిలిపోయిన ఈ ఘటన జరగడానికి మునుపు అసలు ఎన్టీఆర్ ఆలోచనలు ఎలా ఉండేవి? అన్న దానిని దాడి వీరభద్రరావు తెలిపారు. “ఆనాటి పరిస్థితులను ఎన్టీఆర్ బేరీజు వేయలేకపోయారని, వైశ్రాయ్ ఘటనకు ముందు జరుగుతున్న పరిస్థితులను ఆయన తెలుసుకున్నప్పటికీ ఒక మొండి ధైర్యంతో ఉన్నారని” అన్నారు.

‘బ్రదర్! ఓట్లేయండని కోరితే గెలిచిన ఎమ్మెల్యేలు… అలాంటి వీరు నన్ను దించేసే పరిస్థితి ఉత్పన్నమవుతుందా?’ అని ఆయన ఆలోచించారని దాడి చెప్పారు. వాళ్లు తనను ఊరికే బెదిరిస్తున్నారన్న ఆలోచనలో ఉండేవారని, అయితే దింపేసే పరిస్థితికి వచ్చినప్పుడు… వ్యతిరేక వర్గాన్ని పిలవాలని తాము సూచించామని, దానికి ఆయన అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. ఏమీ జరగదులే అన్న ధైర్యం, వారికి తాను లొంగడమేంటనే ఆలోచన కూడా ఉండేదని, దీంతో ఎన్టీఆర్ దేనికి అంగీకరించలేదని అన్నారు.

ఈ సందర్భంలో… ఢిల్లీ నుంచి జాతీయ స్థాయి ఆస్ట్రాలజర్ ను తీసుకొచ్చి చంద్రబాబు జాతకం ఇచ్చి చూడమన్నారని, ఆ జ్యోతిష్యుడేమో ‘రామారావు గారూ మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు, చంద్రబాబుకు రాజయోగం లేదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని తేల్చి చెప్పారని, ఆయన పట్టుదలకు జ్యోతిష్యుడు చెప్పిన మాటలు కలిసి రావడంతో ఎన్టీఆర్ లో ధైర్యం పెరిగిందని తెలిపారు. ఈ ఘటన జరిగిన తరువాత కూడా జ్యోతిష్యుడిపై నమ్మకం పోలేదని… ‘చంద్రబాబు పుట్టినరోజు తప్పా? లేక ఆయన అలా చెప్పాలని చెప్పారా?’ అంటూ ఎన్టీఆర్ తనతో వ్యాఖ్యానించారని… ఫ్లాష్ బ్యాక్ కీలక సంగతులను చెప్పారు.