Custody Movie Public Talkపక్క భాషలో సినిమా చేస్తున్నప్పుడు ఏ దర్శకుడికైనా సదరు ఆడియన్స్ సెన్సిబిలిటీస్ పట్ల ప్రాధమిక అవగాహన ఖచ్చితంగా ఉండాలి. లేదంటే దెబ్బ పడుతుంది. మాస్ హీరోలనో లేదా స్టార్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉందనో సరైన కసరత్తు లేకపోతే గెలవడం కష్టం. ఇలా సక్సెస్ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వెంకట్ ప్రభు మొదటిసారి టాలీవుడ్ మూవీకి నాగ చైతన్య కాంబో ప్రకటించినప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. రెగ్యులర్ స్టైల్ లో ఉండని స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే ఈయన శైలి అజిత్ కి గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చింది. అందుకే కస్టడీ మీద ఆడియన్స్ లో అంచనాలు రేగాయి. ఎడతెరపి లేకుండా ప్రమోషన్లు కూడా బలంగా చేశారు.

ముందు కథేంటో చూద్దాం. శివ(నాగ చైతన్య) నిజాయితీ కలిగిన కానిస్టేబుల్. ప్రేమించిన రేవతి(కృతి శెట్టి)కి పెళ్లి జరగబోతోందని తెలిసి హడావిడిగా రాత్రి వాళ్ళింటికి బయలుదేరిన సమయంలో యాక్సిడెంట్ జరుగుతుంది. దాని వల్ల రాజు(అరవింద్ స్వామి)అనే పేరు మోసిన గ్యాంగ్ స్టర్ ని స్వంత డిపార్ట్ మెంట్ తో సహా ఎవరికీ దొరక్కుండా బెంగళూరు కోర్టుకు తీసుకెళ్లే రిస్కుని భుజాలకెత్తుకుంటాడు. రాజుని చంపే లక్ష్యంతో ముఖ్యమంత్రి(ప్రియమణి)మనుషులు వెంటపడతారు. ఒక క్రిమినల్ ని కస్టడీకి అప్పగించే డ్యూటీ మీద వెళ్లిన శివ ఈ పద్మవ్యూహం నుంచి బయటపడటమే అసలు పాయింట్. మాములుగా వింటే తప్పుబట్టడానికి లేని మంచి థీమ్ ఇది.

ఒక కానిస్టేబుల్ తన ప్రాణాలని, ప్రియురాలిని రిస్క్ లో పెట్టి మరీ రాక్షసుడైన గూండాని రక్షించడమనే ఆలోచనలో మంచి డెప్త్ ఉంది. వెంకట్ ప్రభు ఆ ఆలోచనతోనే కస్టడీని డెవలప్ చేసి ఉంటారు. అయితే రెండున్నర గంటలు ఎంగేజ్ చేయడానికి సరిపడా కంటెంట్ ని రాసుకోవడంలో బాగా తడబడ్డారు. అరగంటకు పైగా సాగే లవ్ ట్రాక్ చప్పగా ఉంటుంది. సిఎం భయపడే ఒక పెద్ద రౌడీ తీరా హీరో హీరోయిన్ల దగ్గర మాత్రం భగవద్గీత చదివి మారిపోయినంత రేంజ్ లో సౌమ్యంగా ఉంటాడు. ఛేజులు ఫైట్లు వస్తూనే ఉంటాయి. కానీ మాస్ సైతం వేటితోనూ కనెక్ట్ అవ్వలేరు. అసలు శివ రాజుల మధ్య జరిగే డ్రామాలోనే ఇంటెన్సిటీ లేనప్పుడు ఫీల్ ఎక్కడి నుంచొస్తుంది

ఇంటర్వెల్ దాకా ఏదోలా బండి నెట్టుకొచ్సిన వెంకట్ ప్రభు ఇక సెకండ్ హాఫ్ కు సరిపడా కంటెంట్ లేక శివ రాజులను పరుగులు పెట్టించడం, అడ్డొచ్చిన వాళ్ళను కొట్టడం తప్ప ఇంకేమి చేయలేదు. దీంతో మంచి థ్రిల్స్ ఇవ్వాల్సిన ఈ ఎపిసోడ్లన్నీ భారంగా సాగుతాయి. గ్రిప్పింగ్ అనే మాటకు ఆస్కారమే లేకుండా చప్పగా సాగే నెరేషన్ తో ఒక దశ దాటాక నిజంగానే పోలీస్ కస్టడీలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి లాంటి తమిళ టాలెంట్స్ అన్నీ వృథా చేశారు. ఇలాంటి ఛేజింగ్ థ్రిల్లర్స్ లో ఊహాతీతంగా కథనం నడవకపోతే బోర్ కొట్టేస్తుంది. ఈజీగా గెస్ చేసే పనైతే ఈ మాత్రం కొత్త దర్శకుడైనా తీస్తాడు

ఇళయరాజా యువన్ శంకర్ రాజా పోటీపడి మరీ తక్కువ స్థాయి సంగీతం ఇచ్చారు. బీజీఎమ్ కొంతవరకు అక్కడక్కడా పర్వాలేదనిపించినా మొత్తంగా చూసుకుంటే వాళ్ళ స్థాయి సంగీతంలో ఇది పదిశాతం కూడా కాదు. చైతు కష్టం నేలపాలైంది. హడావిడిగా స్క్రిప్ట్ రాసుకున్నారో లేక ఈ మాత్రం డ్రామాలు తెలుగు ప్రేక్షకులు చూసి ఉండరన్న భ్రమలో తీశారో కానీ అంచనాలకు సరితూగలేక కస్టడీ కాస్తా అరవ కిచిడీ అయిపోయింది. ఆ మధ్య రామ్ ఇలాగే గుడ్డిగా లింగుస్వామిని నమ్మి వారియర్ గా చేతులు కాల్చుకుంటే ఇప్పుడు చైతు వంతు వచ్చి వెంకట్ ప్రభుకి బలవ్వాల్సి వచ్చింది