Curfew in Telangana - criminal cases on violatorsజనతా కర్ఫ్యూ పూర్తయిన మరునాడు తెలంగాణాలో ప్రజలు రొటీన్ లో పడిపోయారు. భారీ ఎత్తున రోడ్ల మీదకు రావడం మొదలు పెట్టడంతో ప్రభుత్వం, పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎవరికి వాళ్లు అందరూ ఇళ్లల్లోనే ఉండాలన్నారు. బయట ఎక్కువ తిరగకుండా స్వీయ నియంత్రణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

లాక్‌డౌన్‌ పట్టించుకోకుండా ప్రజలు రోడ్లపైకి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను పాటించని వారిపై కేసుల నమోదుకు ఆదేశాలు జారీచేశారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఇక పోతే సాయంత్రం ఏడు గంటల నుండి మరునాడు ఆరు గంటల వరకు సంపూర్ణ కర్ఫ్యూ విదిస్తున్నాం అని ప్రకటించారు.

ఈ సమయంలో పెట్రోల్ బంకులు, షాపులు కూడా మూసివేస్తారు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరూ బయటకు రాకూడదు, కారణం లేకుండా వచ్చిన వారి బండ్లను స్వాధీనం చేసుకుని, క్రిమినల్ కేసులు పెడతారు. నిత్యావసరాల కోసం పగటిపూట దుకాణాలకు, మార్కెట్‌లకు వెళ్లాలన్నారు.

అత్యవసరమనుకుంటేనే బైక్‌పై వెళ్లాలని.. అదీ ఒకరు మాత్రమే వెళ్లాలన్నారు. కారు సెల్ఫ్ డ్రైవింగ్ దగ్గర ఒకరు మాత్రమే వెళ్లాలని.. కారు డ్రైవింగ్ రానివాళ్లు ఒకరిని తోడు తీసుకెళ్లొచ్చన్నారు. అది కూడా ప్రజలు 2-3 కిలోమీటర్ల లోపే తమ పనులు పూర్తి చేసుకోవాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. ఇది ఇలా ఉండగా తెలంగాణాలో తాజాగా ఆరు కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 33కు చేరింది.