ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ భేటి చూస్తే రాష్ట్రాన్ని కేంద్రం బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. మధు అన్నారు. అదే నిజమైతే బీజేపీకి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ది చెప్తారని ఆయన హెచ్చరించారు.
సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… గవర్నర్ రాజకీయాల్లో తలదూర్చడం మంచిది కాదని సూచించారు. చంద్రబాబు చీకటి రాజకీయాలు మానుకోవాలి అని హితవు పలికారు. మధు గారు చెప్పిందంతా బానే ఉంది. అయితే గవర్నర్ పనిగట్టుకుని విజయవాడ వస్తే ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి కలవకుండా ఎలా ఉంటాడు?
రాజకీయాలపై ఇంతటి అనుభవం ఉన్న మధు గారికి ఇది తెలియని విషయమా? లేదంటే వామపక్షాలు ఎప్పుడు చెప్పే పోరాటాల పంథాలో తెలిసి వచ్చేలా గవర్నర్ కే చెబితే మంచిది. కేంద్రంతో తెగతెంపులు చేసుకుని వారిపై విరుచుకుపడుతున్న చంద్రబాబు ఎలాగూ వెనక్కు వెళ్లే అవకాశం అయితే లేదు అనేది అందరికి తెలిసిందే.