CPI Ramakrishna about bjp janasena allianceసిపిఐ నేత రామకృష్ణ చాలా ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. ఈరోజు విశాఖనగరంలో మీడియాతో మాట్లాడుతూ, “జనసేన, బిజెపి కలిసి సాగుతున్నాయని వాటి నేతలు ఇక్కడ చెప్పుకొంటుంటారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలతో సిఎం జగన్మోహన్ రెడ్డికి మంచి సఖ్యత ఉంది గనుకనే ఇంకా అప్పులు పుడుతున్నాయి. ఒకవేళ మోడీ, అమిత్ షాలు జగన్ని వద్దనుకొంటే వారం రోజులు కూడా ప్రభుత్వం నడపలేరు.

కనుక ఇంతకీ బిజెపి జనసేనతో ఉందా లేక వైసీపీతో ఉందా?బిజెపి-వైసీపీల మద్య ఎటువంటి సంబందామూ లేదంటే రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపికి వైసీపీ దూరంగా ఉంటుందా? అంటే కాదనే అందరికీ తెలుసు. అంటే వైసీపీ-బిజెపిల మద్య అవగాహన ఉందని అర్దమవుతోంది. మరి వాటి మద్యలో జనసేన పార్టీ ఏం చేస్తోంది? బిజెపి-వైసీపీల మద్య ఉన్న ఈ అవగాహనపై పవన్ కళ్యాణ్‌ ఏమి చెపుతారు?” అని రామకృష్ణ ప్రశ్నించారు.

జగన్ సర్కార్ చేస్తున్న అప్పుల గురించి మాట్లాడుతూ, “ఓ వైపు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే జగన్ ఇంకా అప్పులు చేస్తూనే ఉన్నారు. మూడేళ్ళలో ఏడు లక్షల కోట్లు అప్పులు చేసారు. మిగిలిన రెండేళ్ళలో మరో మూడు లక్షల కోట్లు అయినా అప్పులు చేయడం ఖాయం. ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నా జగన్ ప్రభుత్వం పోలవరం కట్టలేనంటోంది. అమరావతి నిర్మించలేనంటోంది.

రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలీడేస్, వ్యవసాయానికి క్రాప్ హాలీడేస్ ప్రకటిస్తున్నారు. చివరికి పదో తరగతి ఫలితాలలో కూడా ఉత్తీర్ణత శాతం పడిపోయింది. ఇలా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అస్తవ్యస్తంగా మార్చిన సిఎం జగన్మోహన్ రెడ్డి, వచ్చే ఎన్నికలలో తమ పార్టీకి 175 సీట్లు వస్తాయని ఎలా అనుకొంటున్నారు?” అని ప్రశ్నించారు.