CPI-Narayana- సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఈరోజు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి, విశాఖ సదస్సు ఓ పోలిటికల్ డ్రామా మాత్రమే అని దానిలో రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం అంతా ఉత్తీదేనని ఎద్దేవా చేశారు.

“పారిశ్రామికవేత్తలు ఏం చూసి ఏపీలో రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతారు? నీ ప్రభుత్వానికి (జగన్ ప్రభుత్వం) ఉండే ఆయుషే ఓ సంవత్సరం. మరి ఈ ఒక్క సంవత్సరంలోపుగా ఇన్ని పెద్ద ప్రాజెక్టులు ఎలా వస్తాయి? వచ్చినా నీ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయగలదు?ఈ లక్షల కోట్ల పెట్టుబడుల గురించి నువ్వు చెపుతున్న మాటలని జనాలు కూడా నమ్మడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను, ఐ‌టి కంపెనీలనే నీ ప్రభుత్వం తరిమేయడంతో వేరే రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లిపోయాయి.

ముక్కుపచ్చలారని అమర్ రాజా ఫ్యాక్టరీని తరిమేయడం నిజం కాదా? వైసీపీ నేతల వేధింపులు భరించలేక కొంతమంది అమెరికాలోనే పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు పెట్టుకొన్నారు కూడా. ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం మూడు రాజధానులంటూ పాట మొదలుపెట్టాడో అప్పుడే ఏపీకి రావలసిన వేలకోట్లు పెట్టుబడులన్నీ అమెరికాకు వెళ్లిపోయాయి.

రాష్ట్రంలో ఉన్నవాటిని నీ ప్రభుత్వం తరిమేస్తుంటే నిన్ను, నీ ప్రభుత్వాన్ని ఎవడు నమ్ముతాడు. ఒకవేళ నమ్మినా ఇదొక అనిశ్చిత ప్రభుత్వం. కేవలం ఏడాదే టైమ్ మిగిలుంది మీకు. కనుక రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు కేవలం కాకి లెక్కలే తప్ప నిజమైనవి కావు. ఇదే రెండు మూడేళ్ళ క్రితమే సదస్సు నిర్వహించి పెట్టుబడుల కోసం ప్రయత్నించి ఉంటే ఎవరైనా నమ్మేవారు. వచ్చేవారు. కానీ నీ టైమ్ అయిపోయాక నిన్ను నమ్మి ఎవరొస్తారు? రేపు ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏమిటని పెట్టుబడులు పెట్టేవారు ఆలోచించుకోరా?” అని నారాయణ అన్నారు.

టిడిపి-జనసేనల పొత్తులపై వైసీపీ చేస్తున్న విమర్శలపై కూడా మాట్లాడుతూ, “నీకేమో 175 సీట్లు వస్తాయని గొప్పగా చెప్పుకొంటావు. చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడని, లోకేష్‌కి తెలివిలేదని, పవన్‌ కళ్యాణ్‌ ఒంటరిగా పోటీ చేయలేడని చెప్పుకొంటావు. మరైతే వాళ్ళ గోల నీకెందుకు?వాళ్ళు రోడ్ల మీదకి వస్తే పోలీసులను పంపించి ఎందుకు అడ్డుకొంటున్నావు?

ప్రతిపక్షాలు ఎవరితో ఎవరు పొత్తులు పెట్టుకొంటే మద్యలో నీకెందుకు?ఒంటరిగా రండి చేతులు కాళ్ళు కట్టేసి మిమ్మని చంపేస్తాను అంటే ఎవడైనా వస్తాడా?యుద్ధం అన్నాక వాళ్ళ లెక్కలు వాళ్ళకి ఉంటాయిగా?వాళ్ళు ఎన్ని సీట్లలో పోటీ చేయాలో చెప్పడానికి నువ్వెవరు? వాళ్ళని 175 సీట్లకి పోటీ చేస్తారా? అని సవాళ్ళు విసరడం దేనికి?

నువ్వే గెలుస్తానని నమ్మకం ఉన్నప్పుడు, ఈ రాజకీయాలు, టెన్షన్లు ఎందుకు?హాయిగా భార్యని వెంటపెట్టుకొని సాయంత్ర ఏ సినిమాకో, పార్కుకో పోయి ఎంజాయ్ చేసుకోవచ్చు కదా? సంక్షేమ పధకాలతో అందరూ నిన్నే దేవుడివని కొలుస్తున్నప్పుడు పరదాలు కట్టుకోకుండా ధైర్యంగా వాళ్ళ మద్యకు వెళ్ళవచ్చు కదా? కానీ జనాలని చూసి ఎందుకు భయపడుతున్నావు?” అంటూ నారాయణ ఎద్దేవా చేశారు.

అక్కడ మోడీ, ఇక్కడ జగన్‌ ఇద్దరినీ ఎవరైనా ప్రశ్నిస్తే వారిని వేధించడం మొదలుపెడతారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తోంది. కనుక మోడీ దారిలో నడిస్తే తప్పేమిటనుకొంటున్నారు ఈ జగన్‌.

చంద్రబాబు నాయుడు హయంలో వేలకోట్లు ఖర్చు పెట్టి టిడ్కో ఇళ్ళు కట్టిస్తే, నువ్వు (సిఎం జగన్మోహన్ రెడ్డి) వాటన్నినీ పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా మొదలుపెడుతున్నారు. అదే 90 శాతం పూర్తయిన ఆ 3 లక్షల ఇళ్ళను పూర్తిచేసి వాటికి నీ ఫోటోలు, రంగులు వేసుకొంటే ఆ క్రెడిట్ నీకే దక్కేది కదా? నీ పేరు చెప్పుకొని వేలాదిమంది పేదలు నేడు ఆ ఇళ్ళలో సుఖంగా జీవిస్తుండేవారు కదా?మూడు లక్షల మందికి రెడీమేడ్‌గా ఉన్న ఇళ్ళు ఇవ్వకుండా సొంతంగా ముప్పై లక్షల మందికి కొత్తగా ఇళ్ళు కట్టించి ఇస్తాడట! నమ్మశక్యంగా ఉందా?” అంటూ సీపీఐ నారాయణ సిఎం జగన్మోహన్ రెడ్డిని కడిగిపడేశారు.