CPI ML Potu Ranga Rao Thumb Cut Off During Protestఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్‌ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌లో భాగంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

బంద్‌ను విజయవంతం చేసి ప్రభుత్వం దిగొచ్చేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా సీపీఐ ఎంఎల్ నేత పోటు రంగారావు చేతి బొటనవేలు తెగిపోయింది. వ్యాన్‌లోకి రంగారావును ఎక్కిస్తుండగా రెండు తలపుల మధ్య చేయి పడటంతో బొటనవేలు తెగిపోయింది.

ఒకవైపు రక్తమోడుతున్నా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన నినాదాలు చేస్తూనే ఉన్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కేసీఆర్ చంపమన్నాడా అంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు.. ఇప్పుడు కార్మికుల పక్షాన నిలిచినందుకు.. తనకు లభించిన బహుమానమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయనను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. హుజుర్ నగర్ ఉపఎన్నిక కు రెండు రోజుల ముందు జరుగుతున్న సమ్మె కావడంతో దానిని సక్సెస్ చెయ్యడానికి ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నమే చేసాయి. అయితే సమ్మెను విఫలం చెయ్యడానికి ప్రభుత్వం ఆందోళనకారులను ఎక్కడిక్కడ అరెస్టు చేసింది.