CPI (M) -Pawan Kalyanదేశవ్యాప్తంగా వామపక్షాల ప్రభావం బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు కేరళ ఒక్కటే వారి చేతిలో ఉన్న ఎంతో కొంత పెద్ద రాష్ట్రం. రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే వామపక్ష పార్టీల ప్రభావం ఎప్పుడో కనుమరుగైపోయింది. ఇప్పుడు ఆ పార్టీలు పరాన్నజీవులుగా మారిపోయాయి. ఏదో ఒక పెద్ద పార్టీని పట్టుకుని పొత్తు పెట్టుకుని వారు ఇచ్చే సీట్లలలో ఆ పార్టీ బలంతో గెలవాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికలలో ఖాతాను తెరవలేకపోయాయి.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనైనా ఒకటి రెండు సీట్లు తెచ్చుకుని అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి. దీనికోసం ఈ సారి జనసేన మీద దృష్టి పెట్టాయి. అయితే ఈ సారి కొంచెం దురాశ కూడా ఉన్నట్టు ఉంది. అందుతున్న వార్తల ప్రకారం ఒక్క సిపిఎం పార్టీనే జనసేన నుండి తమకు 60 సీట్లు కేటాయించాల్సిందిగా కోరుతుందట. ఈ మధ్య కాలంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా అన్ని కమ్యూనిస్టు పార్టీలకు కలిపి కూడా అన్ని సీట్లు కేటాయించలేదు.

ఉమ్మడి రాష్ట్రంలో కూడా. ఒకరకంగా ఇది జనసేన షాక్ అనే చెప్పుకోవాలి. రాజకీయ విశ్లేషకులు మాత్రం మొదట ఏదో అడిగేసినా చివరికి వచ్చే సరికి పవన్ కళ్యాణ్ ఎన్ని ఇస్తే అన్ని తీసుకుంటారని, వారికి వేరే ఆప్షన్ లేదని విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే వచ్చే ఎన్నికలలో వామపక్షాలతో తప్ప ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాయలసీమ జనసేన పోరాటయాత్ర లో కూడా అక్కడక్కడా ఎర్ర జండాలు కనిపిస్తున్నాయి.