CPI leader D Raja slams ys Jaganసిపిఐ జాతీయ నాయకుడు డీ.రాజా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సృష్టించిన రాజకీయ అనిశ్చితి ఏపీని రాజకీయం సంక్షోభంలోకి నెట్టిందని ఆయన విమర్శించారు. మూడు రాజధానులపై సీఎం జగన్‌కు ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియడంలేదన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధానాలు ఏపీలో ఎందుకని ప్రశ్నించారు. ప్రజలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలకు విలువ ఇవ్వని రీతిలో ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని రాజా అభిప్రాయపడ్డారు. ప్రజలతో పోరాడటం కంటే కేంద్రంతో పోరాడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టిసారించాలని రాజా ముఖ్యమంత్రి జగన్ కు హితవు పలికారు.

విజయవాడలో పర్యటిస్తున్న ఆయనను రాజధాని ప్రాంత రైతులు కలిసి తమ బాధలను ఏకరువు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మూడు రాజధానులకు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన స్పష్టంచేశారు. అదే ప్రకారం రాజధానిగా అమరావతే ఉండాలన్నది తమ నిశ్చితాభిప్రాయమన్నారు.

రాజధాని కోసం ఉద్యమిస్తున్న మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఇది ఇలా ఉండగా… జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండీ వామపక్షాలలో కూడా విభజన కనపడుతుంది. సిపిఐ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తుండగా, మరో పార్టీ సీపీఎం ప్రభుత్వానికి కొంతమేర అనుకూల వైఖరినే కనబరుస్తుంది.