Covaxin-ఏడాదిగా కరోనా కారణంగా అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీపి కబురు అందించారు. దేశ ప్ర‌జ‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్ ను త్వ‌ర‌లోనే అందుబాటులోకి తెస్తామ‌ని ‌మోడీ ప్ర‌క‌టించారు. వ్యాక్సిన్ చివ‌రి ద‌శ‌లో ఉంద‌ని, క‌రోనా వైర‌స్ పై భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌ధాని ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

వ్యాక్సిన్ రాగానే దేశ‌ప్ర‌జ‌ల‌కు అందించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నామని, యూకే నుండి వ‌చ్చిన కొత్త స్ట్రెయిన్ తో భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌న్నారు ఆయన. మరోవైపు.. ఇండియాలో ఆక్స్ ఫ‌ర్డ్ యూనిర్శిటీ-అస్ట్రాజెనికా త‌యారు చేసిన కోవీశిల్డ్, భార‌త్ బ‌యోటెక్ కోవాక్జిన్ వ్యాక్సిన్ ల‌కు త్వ‌ర‌లో అత్య‌వ‌స‌ర వాడక పర్మిషన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఆక్స్ ఫ‌ర్డ్ యూనిర్శిటీ-అస్ట్రాజెనికా త‌యారు చేసిన కోవీశిల్డ్ కు యూకే ప్రభుత్వం నిన్న అత్య‌వ‌స‌ర వాడక పర్మిషన్ ఇచ్చింది. ఇప్ప‌టికే ఈ వ్యాక్సిన్ థ‌ర్డ్ ఫేజ్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పై నిపుణుల క‌మిటీ రెండుసార్లు స‌మావేశ‌మై, మ‌రింత డేటా కోరింది. అయితే యూకే ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ తో ఇక భారత్ లో కూడా లాంఛనమే అంటున్నారు.

మరోవైపు.. కరోనా వ్యాక్సిన్ ఇంకా రాకముందే ఇదిగో వ్యాక్సిన్ వచ్చేసిందంటూ నకిలీ వార్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వినిపిస్తున్నాయి. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేయిస్తాం అంటూ వ్యక్తుల ఆధార్, బ్యాంకు అకౌంట్ వివరాలు తీసుకుని డబ్బులు కాజేస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.