Covaxin vaccineభారతదేశపు మొట్టమొదటి కరోనా వాక్సిన్ ను తయారు చేస్తున్న భారత్ బయోటెక్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు ఉదయం సందర్శించారు. జీనోమ్ వాలీ లో కంపెనీ వారితో కేటీఆర్ వాక్సిన్ ప్రోగ్రెస్ పై చర్చించారు. ఈ క్రమంలో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా తాము తయారు చేస్తున్న కరోనా వాక్సిన్ పై కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

“కొవాక్సీన్ అనే పేరుతో వస్తున్న ఈ వాక్సిన్ విషయంలో ఇప్పటికే ఎంతో నైపుణ్యం సాధించాం. వాక్సిన్ తయారీలో అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో తోడ్పాటుని అందిస్తున్నాయి. మేము పోటీదారులైన ఈ ఉమ్మడి శత్రువుపై పోరాటానికి కలిసికట్టుగా శ్రమిస్తున్నాం. అలాగే వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకు కొవాక్సీన్ ని తీసుకుని వస్తాం,” అని చెప్పుకొచ్చారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ముందు ఉన్న ఆక్సఫర్డ్ యూనివర్సిటీ వాక్సిన్ పై మనదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. లండన్‌లో జరిగిన హ్యూమన్ ట్రయల్స్‌లో ఇప్పటికే సత్ఫలితాలు రావడంతో తాజాగా ఈ వ్యాక్సిన్‌పై భారత్‌లోనూ ప్రయోగాలు చేయనున్నారు.

కోవిషీల్డ్ గా పిలుస్తున్న ఈ వాక్సిన్‌పై ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే నిర్వహించనున్నారు. సుమారు 5వేల మందితో భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. అలాగే త్వరలోనే పెద్ద పరిమాణంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి కూడా మొదలు పెడతామని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.