court notices to valmiki movie team-టైటిల్ వివాదం వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి టీం ను వదిలేలా లేదు. ఈ సినిమా టైటిల్‌ ప్రకటించిన దగ్గర నుంచి టైటిల్‌ మార్చాలంటూ బోయ కులస్తులు ఆందోళనలు చేస్తున్నారు. సినిమా టైటిల్‌ తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉందంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల సినిమా టైటిల్ మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈరోజు హైకోర్టులో ఆ పిటీషన్ హియరింగ్ కు వచ్చింది.

విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ, సెన్సార్‌ బోర్డు, ఫిలిం ఛాంబర్‌లతో పాటు హీరో వరుణ్‌ తేజ్‌కు, చిత్రయూనిట్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. అయితే ఈ సినిమా ఈ నెల 20న విడుదల కాబోతుంది. సినిమా విడుదలపై న్యాయస్థానం ఎటువంటి స్టే విధించలేదు. దీనితో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్టే.

నాలుగు వారాలు అంటే అప్పటికి సినిమా విడుదలై రన్ కూడా దాదాపుగా పూర్తి అయిపోతుంది. అప్పుడు ఎటువంటి తీర్పు వచ్చినా పెద్దగా నష్టం ఉండదు. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం పై వరుణ్ తేజ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. గత నాలుగు చిత్రాలలో మూడు హిట్లు ఇచ్చి మంచి ఊపు మీద ఉన్నాడు వరుణ్ తేజ్. 14రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న వాల్మీకి చిత్రానికి మిక్కీ జె మేయర్ చిత్రానికి సంగీతం అందించాడు.