counsel to madhu priyaతన భర్త వేధింపుల పాలు చేస్తున్నాడంటూ శనివారం రాత్రి సమయంలో హుమాయూన్ పోలీస్ స్టేషన్ లో సింగర్ మధుప్రియ చేసిన ఫిర్యాదు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరికీ పోలీసుల సమక్షంలో మానసిక వైద్యులు డాక్టర్ రాధికా ఆచార్య నేతృత్వంలో సుమారు ఐదు గంటల పాటు వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అలాగే వారిద్దరితో విడివిడిగా నాలుగు గంటల పాటు మాట్లాడారు. దీంతో మధుప్రియ – శ్రీకాంత్ జంట దంపతులు రాజీకి వచ్చినట్లుగా కనపడుతోంది.

పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం మధుప్రియ విలేకరులతో మాట్లాడిన మధుప్రియ… మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తయిందని, కొన్నాళ్లు కలిసి ఉండాలని పోలీసులు చెప్పారని, అప్పుడు అతని తీరు మారకుంటే రెండోదశ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పోలీసులు అన్నారని చెప్పింది. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో పాటే తాను ఉండాలని అనుకుంటున్నట్లు మధుప్రియ పేర్కొంది. మొదటి దశ కౌన్సిలింగ్ అనంతరం శ్రీకాంత్ పై మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించిన విలేఖర్లకు “హి ఈజ్ గుడ్” అంటూ జవాబిచ్చింది మధుప్రియ.

అలాగే మీడియాతో మాట్లాడిన పోలీసులు… “సైకాలజిస్టులు ముగ్గురు కూడా వారిద్దరితో విడివిడిగా మాట్లాడారని, ప్రస్తుతం మధుప్రియ షాక్ లో ఉన్నానని, ఆలోచించుకోవడానికి కొన్ని రోజులు కావాలని కౌన్సెలింగ్ అనంతరం ఆమె చెప్పిందని, తన భర్త శ్రీకాంత్ పై ఎటువంటి లీగల్ యాక్షన్ అవసరం లేదని, తన తల్లిదండ్రులతో కలిసి గోదావరి ఖని వెళ్లిపోతానని” మధుప్రియ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అలాగే, మధుప్రియను శ్రీకాంత్ వేధిస్తున్న విషయం వాస్తవమేనని, కానీ ప్రస్తుతం మధుప్రియ తనతో పాటు ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని శ్రీకాంత్ వ్యక్తం చేశాడని, దీంతో ఆమె ఒక అవగాహనకు వచ్చిందని.. ఈ కౌన్సెలింగ్ లో మధుప్రియ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.