Corpse politics has become a hot topicజంగారెడ్డిగూడెంలో కల్తీసారాకు 26 మంది చనిపోయారని టీడీపీ పెద్ద ఎత్తున అధికార పార్టీపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో… కౌంటర్ ఎటాక్ కు వైసీపీ కూడా రంగంలోకి దిగింది. సహజ మరణాలను సారా మరణాలుగా చిత్రీకరించి టీడీపీ శవరాజకీయం చేస్తోందని ‘వైసీపీ అండ్ కో’ విమర్శలు చేస్తోంది. ఈ ఇద్దరి వాదనలతో సోషల్ మీడియా కూడా వేడెక్కింది.

అసలు శవరాజకీయాలు అంటే ఏమిటో తెలుసా అంటూ… నాటి వైఎస్సార్ మరణం నుండి నేటి సారా మరణాల వరకు అన్నింటిని తెలుగు తమ్ముళ్లు ప్రస్తావిస్తున్నారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో కాంగ్రెస్ ప్రముఖులందరూ బాధలో ఉండగా, చేతులెత్తి దండం పెడుతున్న జగన్ ఫోటోను పోస్ట్ చేసి, “ఇది కదా అసలు సిసలు శవరాజకీయం అంటే” అని టీడీపీ వర్గీయులు బదులిస్తున్నారు.

అలాగే వైఎస్సార్ మరణించిన సమయంలో ఇతరత్రా కారణాలతో చనిపోయిన వారందరిని ‘వైఎస్సార్ అకౌంట్’లోనే వేసి, ఆయా కుటుంబాలకు 5000 రూపాయల ఆఫర్లను ఇచ్చిన విధానంపై నాడు ఆంగ్ల పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురించాయి. వాటిని “శవ రాజకీయాలు” అంటారు అంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఫుల్ స్వింగ్ లో అధికార పార్టీ తీరును వైరల్ చేస్తోంది.

అలాగే బాబాయ్ చనిపోతే గుండెపోటుగా చిత్రీకరించి, దానిని టీడీపీ పైకి నెట్టివేసిన వైనాన్ని శవ రాజకీయాలు అంటారు అంటూ తీవ్రస్థాయిలో తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. కల్తీ సారాతో చనిపోతే సహజ మరణాలని చెప్పడం కూడా శవ రాజకీయాల క్రిందకే వస్తుందని ఓ రేంజ్ లో ప్రతిపక్ష పార్టీ తన దూకుడును ప్రదర్శిస్తోంది.

జంగారెడ్డిగూడెంలో జరిగిన విషాదానికి సరైన చర్యలు తీసుకోకుండా ప్రతిపక్షం పైన దాడి చేయడంలో అధికార పార్టీ తీరు విమర్శలకు తావిస్తోంది. నూటికి నూరుపాళ్లు ఇవి ప్రభుత్వ హత్యలుగానే టీడీపీ బలంగా ప్రచారం చేస్తున్న నేపధ్యంలో వైసీపీ లేవనెత్తిన “శవ రాజకీయాలు” టాపిక్ తిరిగి మళ్ళీ వైసీపీ మెడకు చుట్టుకునే విధంగా ఈ టాపిక్ మారింది.