coronavirus positive to ysr congress mlaలాక్ డౌన్ విధించిన తొలినాళ్ళలో శ్రీకాళహస్తి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఒక ట్రాక్టర్ ర్యాలీ తీసి కొందరికి నిత్యావసర సరుకులు పంచారు. ఆ తరువాత ఆ ర్యాలీ లో పాల్గొన్న చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా కోరలు చాచింది.

అప్పట్లో లాక్ డౌన్ ఉల్లంఘనను సదరు ఎమ్మెల్యే సమర్ధించుకున్నారు. తాజాగా బియ్యపు మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతో పాటు ఆయన సతీమణికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం తిరుపతి అమర ఆసుపత్రిలో మధుసూదన్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీవాణిరెడ్డి చికిత్స తీసుకుంటున్నారు.

ఎమ్మెల్యేకు కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో శ్రీకాళహస్తి వైసీపీ కార్యాలయంలోని సిబ్బంది, పలువురు కార్యకర్తలకు కరోనా పరీక్షల కోసం వైద్య సిబ్బంది నమూనాలు సేకరిస్తున్నారు. కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరుగుతుంది అనేదానికి ఇది నిదర్శనం అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో కరోనా విళయతాండవం చేస్తుంది. రోజుకు దాదాపుగా 2500 కేసులు, నలభై మరణాలు సాధారణం అయిపోయాయి. ఇప్పటికే మొత్తం కేసులు నలభై వేలకు పైగా చేరాయి. ప్రభుత్వం కరోనా కంట్రోల్ కు ఎన్నో చర్యలు చేపడుతున్నాం అని చెబుతున్నా ఆ దిశగా ఫలితాలు కనిపించడం లేదు.