coronavirus effect to vijayawda kanaka durga temple employees-లాక్ డౌన్ లో పేదల కడుపు నింపడానికి విజయవాడ దుర్గ గుడి ప్రతి రోజూ పురపాలక సంఘం అధికారులకు 2,000 ఆహారపు పొట్లాలు అందజేస్తుంది. అయితే ఉన్నఫళంగా శనివారం నుండి అన్న వితరణ ఆపేశారు. ఆహారం ప్యాక్ చేస్తున్న సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

దీనితో విజయవాడలో కలకలం రేగింది. ఇది ఇలా ఉండగా.. లాక్ డౌన్ ముందు నుండి రాష్ట్రంలో అన్ని దేవాలయాలలో దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కేవలం అర్చక స్వాములు మాత్రమే రోజూ నిర్వహించాల్సిన కైంకర్యాలు చేస్తున్నారు. దీనితో నిత్యం రద్దీగా ఉండే దేవాలయాలు వెలవెల పోతున్నాయి.

అయితే సమాజ హితం కోరి పెద్ద ఆలయాలు అన్నీ అన్న వితరణ నిలిపివెయ్యకుండా పేదలకు, వలస కూలీలకు బాసటగా నిలుస్తున్నాయి. ఇది ఇలా ఉండగా.. గత 24 గంటలలో ఆంధ్రప్రదేశ్ 50 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసులు 1,980 కు చేరాయి.

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్, గుంటూరు, కృష్ణా జిల్లాలలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ మూడు జిల్లాలలోని రాష్ట్రంలోని 65% పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. మరోవైపు దేశంలోని మొత్తం కరోనా కేసులు 62,938 అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ‬