Coronavirus effect to tirumala tirupatiకరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలకు ఉపక్రమించాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మార్చి 31వరకు దేశంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అన్ని థియేటర్లు, జిమ్స్, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, స్విమ్మింగ్ పోల్స్ మూసేయాలని నిర్దేశించింది. ఇది ఇలా ఉండగా కరోనా ప్రభావం గుడులను కూడా తాకుతుంది. ముంబైలోని సిద్ధి వినాయక్ టెంపుల్ ఇప్పటికే మూతపడగా… ప్రసిద్ధ షిరిడి సాయి బాబా గుడి కూడా ఈ సాయంత్రం నుండి మూసి వేశారు.

తాజాగా ఈ ప్రభావం తిరుమల మీద కూడా పడనుందా అని అంతా అనుకుంటున్నారు. కరోనా విపత్తుని కూడా లెక్క చెయ్యకుండా తిరుమలకు రోజూ 80000 నుండి లక్ష మంది వస్తున్నారు. దీనితో కరోనా ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంతా భయపడుతున్నారు. షిర్డీ వలే తిరుమల కూడా భక్తులు రాకుండా కట్టడి చేస్తే అది సంచలనమే.

భూమిపై వైకుంఠంగా చెప్పబడే తిరుమలలో వేంకటేశ్వరస్వామి రోజూ తన పవళింపు సమయం కూడా రెండు మూడు గంటలకు మించకుండా చూసుకుని భక్తులకు దర్శనం ఇస్తుంటారు. అటువంటి స్వామి భక్తులకు దర్శనం ఇవ్వకుండా ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే రాజకీయ కారణాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా మూసివేతల జోలికి వెళ్లడం లేదు. పరిస్థితి అదుపులోకి వస్తే తిరుమల తలుపులు మూసే అవకాశం రాకపోవచ్చు.