Coronavirus community testing in andhra pradeshరాష్ట్రంలో ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్న ప్రాంతాలలో కమ్యూనిటీ టెస్టింగ్ కు సిద్ధం అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కమ్యూనిటీ టెస్టింగ్ అంటే బాగా కేసులు నమోదు అవుతున్న ప్రాంతంలో రాండమ్ గా టెస్టులు చేసి వైరస్ వ్యాప్తి ఉందేమో తెలుసుకోవడం. ఇందుకోసం దక్షిణ కొరియా నుండి లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లు తెప్పించింది ప్రభుత్వం.

ఈరోజు ఉదయం సియోల్‌ నుంచి ప్రత్యేక చార్టర్‌ విమానం ద్వారా ఇవి వచ్చాయి. ఈ కిట్ల ద్వారా 10 నిమిషాల వ్యవధిలోనే ఫలితం వస్తుంది. 4–5 రోజుల్లో అన్ని జిల్లాలకూ ఈ కిట్ల ను పంపిస్తారు. ఇవి శరీరంలోని యాంటీ బాడీస్ బట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని కనుగొనడానికి ఉపయోగపడుతుంది.

కరోనా సోకిందా అని తెలియడానికి ఇది సరైన పద్దతి కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీ టెస్టింగ్ కు మాత్రం వీటిని వాడుతున్నారు. ఇది ఇలా ఉండగా… ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ లో 572 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇప్పటివరకూ కేవలం 35 మంది మాత్రమే కోలుకుని ఇంటికి వెళ్లారు.

అలాగే ఈ వైరస్ బారిన పడి పద్నాలుగు మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని పదమూడు జిల్లాలలో పదకొండు జిల్లాలను కేంద్ర ప్రభుత్వం హాట్ స్పాట్స్ గా ప్రకటించింది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో మాత్రమే ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు