ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గే సూచనలు కనిపించడం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 62 కరోనా వైరస్ కేసులు, మరో రెండు మరణాలు నమోదయ్యాయి. ఈ 62 కేసుల్లో కర్నూలు అత్యధికంగా 27 కేసులను నమోదు చేసింది. ఈ కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసులు 955 వరకు ఉన్నాయి.

ఏపీలో ఇప్పటివరకూ 29 మంది మరణించారు మరియు 145 మంది డిశ్చార్జ్ అయ్యారు, 781 క్రియాశీల కేసులు ఉన్నాయి. 261 కేసులతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉంది. గుంటూరు కూడా 206 కేసులతో 200 మార్కును దాటగా, కృష్ణ జిల్లాలో 102 కేసులు ఉన్నాయి. ఈ జిల్లాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి, తక్షణ జోక్యం అవసరం.

టెస్టులు ఎక్కువగా చేస్తున్న కారణంగా కేసులు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నా తెలంగాణతో పోల్చితే రికవరీ కేసులు తక్కువగా ఉండటం, మరణాలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. శ్రీకాకుళం మరియు విజయనగరం ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేకుండా రాష్ట్రంలో ఉన్న జిల్లాలుగా కొనసాగుతున్నాయి.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 23,077. ప్రస్తుతం జరుగుతున్న రెండో దశ లాక్ డౌన్ వచ్చే నెల 3 వరకు ఉంటుంది. ఆ తరువాత కేంద్రం దానిని పెంచుతుందా లేదా అనేది చూడాలి. తెలంగాణలో ప్రభుత్వం మే 7వరకూ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.