coronavirus cases in visakhapatnamగత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 47 కొత్త కేసులు నమోదయ్యాయి, మొత్తం 2,561 గా ఉంది. గత రెండు రోజులలో అకస్మాత్తుగా కేసుల సంఖ్య పెరిగింది. కృష్ణ జిల్లాలో ఒక మరణం సంభవించగా, నలభై ఏడు మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. 56 మంది మరణించగా, 1,778 మంది డిశ్చార్జ్ కావడంతో 727 క్రియాశీల కేసులు ఉన్నాయి.

ఈ మధ్యకాలంగా ప్రభుత్వం జిల్లా వారీగా వివరాలను విడుదల చేయడం లేదు. ఈ సంక్షోభ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలైనంత పారదర్శకంగా ఉండాలని, వాస్తవాలను దాచవద్దని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దీని మీద తాజాగా రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి.

కొత్తగా నమోదు అవుతున్న కేసులలో విశాఖలో ఎక్కువగా నమోదు అవుతున్నాయని, విశాఖను రాజధానిగా చెయ్యాలని ప్లాన్ చేస్తున్న ప్రభుత్వం కావాలనే ఈ విషయాన్నీ దాచిపెడుతుందని పలువురు ఆరోపణ. ఇది ఎంత వరకూ నిజమో తెలియదు గానీ ఇటువంటి సీరియస్ విషయంలో పారదర్శకత పాటించకపోతే ఇటువంటి విమర్శలే వస్తాయి.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఈ ఉదయం బులెటిన్) ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,25,101. నిన్న ఒక్క రోజే దేశంలో 6,500కు పైగా కేసులు నమోదు అయ్యాయి. నాలుగో దశ లాక్ డౌన్ సందర్భంగా ఎక్కువగా మినహాయింపులు ఇచ్చిన నాటి నుండీ కేసులు పెరుగుతున్నాయి.