Buggana Rajendranath Reddyకరోనా భయంతో దేశమంతా వణికిపోతుంది. రెండు రోజులుగా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. దేశంలో ఆ కేసులు 271కి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు మూడు కేసులు మాత్రమే నమోదైనా ప్రజలు మాత్రం భయబ్రాంతులకు గురి అవుతున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వానికి మాత్రం రాజకీయాలే ముఖ్యమైపోయాయి.

ఇంతటి క్లిష్ట సమయంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్ పెట్టారు. కరోనా జాగ్రత్తలు చెబుతారేమో అనుకుంటే… ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేయడం అప్రజాస్వామికమని తప్పుపట్టారు.

రాష్ట్రంలో కరోనాపై అంచనా వేయకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనాపై అధికారికంగా ఈసీ సమీక్ష చేసిందా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్‌సీపీ వంద శాతం సీట్లు గెలిచిందని.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం కావడంలో తప్పేముందన్నారు.

ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ రాశారు అని చెబుతున్న ఆ లేఖ ను ఆయనే రాశారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికి బుగ్గన ప్రెస్ మీట్ బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. రాష్ట్రమంతా తీవ్ర ఆందోళనలో ఉంటే అవేమీ పట్టకుండా ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యమైపోయాయి అనే మెస్సేజ్ ప్రజలకు పంపారు.