converting Uppal Cricket Stadium into isolation wardతెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ నివారణ చర్యలను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని కేసులు ఇప్పటికే 39కి చేరాయి. ప్రతిరోజూ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ స్టేడియంలో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చెయ్యాలని ఆలోచన చేస్తుంది ప్రభుత్వం.

స్టేడియంలో 40 పెద్ద రూమ్‌లు ఉన్నాయని, పార్కింగ్‌ సదుపాయం కూడా ఉండడంతో ఎమర్జెన్సీలో స్టేడియంని వాడుకోవాలని భావిస్తుంది. దీనిపై హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌, ఇతర అధికారులతో ప్రభుత్వం చర్చినట్టు సమాచారం. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది.

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ని తెలంగాణ రాష్ట్రంలో స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. సాధ్యమైనంత వరకూ పోలీసులు ప్రజలను రోడ్ల మీదకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అక్కడక్కడా మాట వినని ఆకతాయిల మీద లాఠీలు కూడా ఝుళిపిస్తున్నారు.

‘ఒక వ్యక్తితో వెయ్యి మందికి సోకే ప్రమాదముంది. మొత్తం సమాజానికి ప్రమాదం. కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చర్యలు ఆపదు. 24 గంటల కర్ఫ్యూ, షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్స్, ఆర్మీని పిలిచే దుస్థితి తెచ్చుకోవద్దు’ అని ప్రజలను సీఎం కేసీఆర్ వారించిన సంగతి తెలిసిందే.